Handloom Weavers Problems In Yemmiganur : తెలుగు రాష్ట్రాల్లోనే చేనేతకు పుట్టినిల్లు లాంటిది కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు. ఎమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలు, ఆదోని, గూడూరు, నందవరం, గోనెగండ్ల, నాగలదిన్నె, నంద్యాల, ఆత్మకూరులో జనం ఎక్కువగా చేనేత వృత్తిపై ఆధారపడ్డారు. గతంలో జిల్లాలో 21 వేల చేనేత కుటుంబాలు ఉండేవి. ప్రతి ఇంట్లో మగ్గాలు వేసుకొని వచ్చే కూలితో జీవించేవారు. రానురానూ వారి కష్టానికి తగిన ప్రతిఫలం లేకపోవడంతో చేనేత వృత్తిని వదిలేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 15 వేల మగ్గాలు ఉన్నాయి. వీటిపై ఎక్కవగా చేనేత వస్త్రాలు, పట్టుచీరలు, తువ్వాళ్లు, దుప్పట్లు, గద్వాల పట్టు, ధర్మవరం సిల్క్ వస్త్రాలను తయారు చేస్తున్నారు. వీరంతా మాస్టర్ వీవర్స్ కింద పని చేస్తూ కూలీపై ఆధారపడి జీవిస్తున్నారు
చేనేత కార్మికురాలు జయమ్మ జీవిత పోరాటం : కుటుంబ పోషణ అంతా ఆమె భర్త చూసుకునేవారు. ఆ కుటుంబానికి అప్పులు ఉరితాళ్లుగా మారాయి. నేత చీరలకు సరైన ధరలు లేక అప్పుల ఊబిలో ఇరుక్కుపోయారు. పదేళ్ల కిందట భర్త పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు చిన్నపిల్లలతో సహా కుటుంబ భారం అంతా జయమ్మపై పడింది. పిల్లలను చదివించుకోవాలని, వారిని ప్రయోజకుల్ని చేయాలని, కుటుంబాన్ని కష్టాల నుంచి గట్టెక్కించాలని కూలీ పనులకు వెళ్లారు. తమ కుటుంబానికి ప్రభుత్వం భరోసా ఇస్తుందని ఎదురు చూశారు. కాళ్లు అరిగేలా అధికారుల చుట్టూ తిరిగినా స్పందన లేదు. పది సంవత్సరాలైనా పైసా సాయం అందలేదు. కూలీ సొమ్ముతోనే కుమార్తెకు వివాహం జరిపించారు. ప్రస్తుతం రోజూ మగ్గం నేస్తూ జీవనం సాగిస్తున్నారు. వచ్చిన కూలీ సొమ్మే కుటుంబానికి ఆధారమైంది.
చిరు వ్యాపారిగా మారిన శ్రీనివాసులు : ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన ఆయన, భార్య లక్ష్మి కలిసి చేనేత రంగంలో రాణించేవారు. 2 మగ్గాలపై అందమైన అల్లికలు నేసి చీరలు అమ్ముకొని ఉపాధి పొందేవారు. రానురానూ చేనేతకు ఆదరణ తగ్గడంతో వృత్తిని మానుకున్నారు. నేసిన చీరలకు సరైన మార్కెట్ లేక మగ్గాలను అమ్ముకున్నారు. కుటుంబాన్ని పోషించాలని వీధి వ్యాపారిగా మారి పండ్లను అమ్ముతున్నారు. అయినా వృత్తిపై ప్రేమ, మమకారం తగ్గక పోవడంతో కూలీ మగ్గం ఏర్పాటు చేసుకున్నారు. వీధి వ్యాపారంతో పాటు టైం దొరికినప్పుడల్లా భార్యతో కలిసి మగ్గం నేస్తూ కుటుంబాన్ని ముందుకు నెట్టుకొస్తున్నారు. చేనేతలో ఉపాధి లేకే తీవ్ర అవస్థలు పడుతున్నామని వాపోయారు.
పూట గడవడం కోసం హోటల్ రంగాన్ని ఎంచుకున్న కార్మికులు : గణేష్, రాఘవేంద్ర, బత్తులయ్య ఇలా ఎంతో మంది చేనేత కార్మికులు మగ్గాలపై పనులు లేక, పస్తులు ఉండలేక హోటళ్లలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. హోటల్లో అయితే తిండి దొరుకుతుంది. ప్రతి నెలా పని ఉంటుందన్న ఉద్దేశంతో ఎంతో మంది హోటల్ రంగాన్ని ఎంచుకుంటున్నారు.
ఆత్మహత్యలను తగ్గించాలని కోరుకుంటున్న కార్మికులు : కర్నూలు జిల్లాలో అప్పుల భారంతో పలువురు చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకోగా ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం లభించలేదని చేనేతలు వాపోతున్నారు. ప్రభుత్వం పన్ను భారం తగ్గించి, సబ్సిడీలు ఇచ్చి కార్మికుల్ని, చేనేత వృత్తిని కాపాడాలని కోరుతున్నారు.
"పిల్లల చిన్నప్పటి నుంచి మగ్గం నేస్తున్నాము. మగ్గంలోనే బతికాము. ఇందులో గిట్టుబాటు ధర లేదు. పూట గడవడం కోసం హూటళ్లలో పని చేస్తున్నాం. పళ్ల వ్యాపారాలు చేస్తున్నాం. బతకడానికి వివిధ రకాల పనులు చేస్తున్నాం."- చేనేత కార్మికులు
ఇవీ చదవండి