Farmer Suicides in Kurnool District: అప్పుల భారం అన్నదాతల పాలిట మరణశాసనంగా మూరుతోంది. ఎంత కష్టపడినా అప్పులే మిగిలిన రైతన్నలు మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీంతో ఈ కారణాలతోనే ఉమ్మడి కర్నూలు జిల్లాలో శనివారం ఒక్క రోజే నలుగురు రైతులు కన్నుమూయడం తీవ్ర విషాదాన్ని నెలకొంది.
ఆయా ఘటనలకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నంద్యాల జిల్లా అవుకు మండలం కునుకుంట్లకు చెందిన సుబ్బరాయుడు తన ఎకరం పొలంతో పాటు మరో పదెకరాలను కౌలుకు తీసుకుని సాగు చేశారు. ఇందుకోసం దాదాపు 10 లక్షల రూపాయలను మేర అప్పులు చేశారు. నాలుగు నెలల క్రితం ఆయన మరణించడంతో అప్పులు తీర్చాలంటూ ఆయన కుమారుడు నాగేష్(23)పై అప్పులవాళ్లు ఒత్తిడి పెంచారు. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి నెలరోజుల వయసున్న కుమారుడు ఉన్నాడు.
Farmer Burnt Banana Crop: పది నెలలు గడిచినా రాని అరటి గెలలు.. మనస్థాపంతో చెట్లకు నిప్పు
కర్నూలు జిల్లా నందవరం మండలం గురజాలకు చెందిన కురువ బీరప్ప(33) తన పొలంతోపాటు మరో 10 ఎకరాలను కౌలుకు తీసుకొని వరిని సాగు చేస్తున్నారు. దీని కోసం బ్యాంకులో 2 లక్షల రూపాయలను, బంధువుల వద్ద 2 లక్షలు అప్పులు చేశారు. వర్షాలు పడకపోవడంతో పంట చేతికందక అప్పు తీర్చలేనని భావించి శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
నంద్యాల జిల్లా డోన్ మండలం కొచ్చెర్వుకు చెందిన రైతు శివకుమార్(31) తన రెండెకరాల పొలంలో మూడు బోర్లను వేసి పంటలను సాగుచేశారు. ఇందుకోసం దాదాపు 12 లక్షల రూపాయలను అప్పు చేశారు. ఇంత కష్టపడినా పంట చేతికందకపోవడంతో మనస్తాపం చెంది ఈ నెల 8వ తేదీన పురుగులమందు తాగారు. కర్నూలులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందారు.
కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం ఇనగండ్ల గ్రామానికి చెందిన రైతు శ్రీకృష్ణదేవరాయల్(52) తనకున్న మూడు ఎకరాల్లో పత్తిసాగు చేపట్టారు. ఇందుకోసం 5 లక్షల రూపాయలను అప్పులు చేశారు. గత సంవత్సరం నష్టం రావడంతో అప్పులు మరింత పెరిగాయి. దీంతో ఆవేదన చెందిన రైతు శుక్రవారం రాత్రి తన పొలం వద్ద ఉన్న చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.
AP Farmers: అన్నదాతకు మాటల్లోనే సాయం.. చేతల్లో చేతులెత్తేస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం
Chandrababu Comments Over Farmers Committing Suicide Due to Debt: రాష్ట్రంలో రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో పర్యటనకు వెళ్లినా రైతుల కష్టాలు, సమస్యలు కనిపిస్తున్నాయన్నారు. నిన్న ఒక్క రోజే ఉమ్మడి కర్నూలు జిల్లాలో నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క రోజులో ఒక్క జిల్లాలో నలుగురు రైతన్నలు ప్రాణాలు తీసుకున్నారంటే.. రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుందని మండిపడ్డారు.
రైతుల సమస్యలపై ప్రభుత్వ పూర్తి స్థాయిలో దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. సాగుకు సబ్సిడీలు, పంటలకు గిట్టుబాటు ధరలు ఇచ్చి రైతుకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు తేల్చిచెప్పారు. ఒక్క రోజులో నలుగురు అన్నదాతలను కోల్పోయిన పరిస్థితిని ప్రభుత్వం అత్యంత తీవ్రమైన అంశంగా పరిగణించి తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన నిర్ణయాలు, చర్యల ద్వారా రైతులు, కౌలు రైతులకు అండగా నిలవాలని చంద్రబాబు కోరారు.
Farmers problems: రైతుకి 'భరోసా' ఇవ్వని కేంద్రాలు.. దీంతో ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు