కర్నూలు సర్వజన వైద్యశాల అభివృద్ధికి ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేశారు?
సూపరిండెంట్ గా ఈ పదవి నిర్వహించేందుకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి ధన్యవాదాలు. ప్రస్తుతం స్టేట్ కొవిడ్ ఆసుపత్రి నుంచి నాన్ కోవిడ్ ఆసుపత్రిగా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. కొవిడ్ రోగులకు వైద్య సేవలు అందించటంలో కర్నూలు సర్వజన వైద్యశాల మొదటి స్థానం సాధించిందని చెప్పటానికి గర్విస్తున్నాను. నేను ఈ మధ్యనే బాధ్యతలు తీసుకున్నాను. గతంలో కొవిడ్ సేవలు అందించిన అందరికీ ధన్యవాదాలు. రానున్న పుష్కరాలు, పండుగలు, శుభకార్యాల కోసం అధికంగా తిరుగుతున్నారు. వారు కనీస జాగ్రత్తలు తీసుకోవటం లేదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
సూపర్ స్పెషాలిటీ బ్లాక్ లో కొవిడ్ పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తున్నారు. దీని వల్ల అక్కడ ఉన్న సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో సేవలు నిలిచిపోయాయి? దీని వల్ల రోగులకు ఇబ్బంది కాదా?
గతంలో లాగా ప్రస్తుతం కరోనా రోగులు రావటంలేదు. పాజిటీవ్ కేసులు తక్కువగానే వస్తున్నాయి. కరోనా రోగులకు 170 పడకలు మాత్రమే అవసరం ఉంది. రోజూ 20 మంది కంటే ఎక్కువ రావటం లేదు. వారందరినీ ఒక బ్లాక్ లోకి తరలించనున్నాం. వారం రోజుల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తాం. మొత్తం శానిటైజ్ చేస్తాం. మరోవైపు వైద్య విద్యార్థులకు గత 6 నెలలుగా బోధన లేక ఇబ్బంది పడుతున్నారు. అందువల్లే కొవిడ్ ఆసుపత్రిని... నాన్ కోవిడ్ ఆసుపత్రిగా చేస్తే విద్యార్థులకు మేలు జరుగుతుంది. రోగులకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించేందుకు అవకాశం ఉంటుంది.
వైద్యులు సమయపాలన పాటించరు. వైద్యసేవలు అందించటంలో నిర్లక్ష్యం వహిస్తారు అనే అపవాదు ఉంది. ఈ విషయంలో మీరేమంటారు?
మీరు చెప్పేది కరెక్ట్ కాదు. చాలా మంది వైద్యులు నిజాయితీగా పనిచేస్తున్నారు. 99 శాతం వైద్యులు సమయపాలన పాటిస్తున్నారు. మంచి సేవలు అందిస్తున్నారు. బహుశా ఒకశాతం వైద్యులు ఉంటే ఉండవచ్చు. అలాంటి వారు ఎవరైనా ఉన్నారని మాకు తెలియజేస్తే... వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాం.
రోగుల విషయంలో సిబ్బంది వ్యవహరించే తీరు బాగాలేదన్న అపవాదు ఉంది? దీనిని ఏ విధంగా అధిగమిస్తారు?
రోగులతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. పని ఒత్తిడి వల్ల కొందరు దురుసుగా ప్రవర్తించవచ్చు. వీలైనంతవరకు అందరూ మంచిగానే ప్రవర్తించాలి. త్వరలోనే మార్పు వస్తుంది.
మీ మార్కు అభివృద్ధిని ఏ విధంగా చూపించబోతున్నారు?
పారిశుద్ధ్యాని పెద్దపీట వేస్తాను. ఆసుపత్రిలో మంచి వాతావరణం ఉండాలి. అందరికీ రక్షణ ఉండాలి. బోధన బాగా జరగాలి. వీటిపైన మొదట దృష్టి పెట్టాను.
రెండో దశ కరోనాను ఏ విధంగా ఎదుర్కోనున్నారు?
రెండోదశ కరోనాను ఎదుర్కోవటానికి 2 వందల పడకలు సిద్ధంగా ఉన్నాయి. అవి కాకుండా నాన్ కోవిడ్ పడకలు సైతం వాడుకోవటానికి అవకాశం ఉంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
ఆసుపత్రి ఆవరణలో నిర్మిస్తున్న ప్రాంతీయ క్యాన్సర్ ఆసుపత్రి పనులు ఆగిపోయాయి. ఈ పనులు ఎలా పూర్తి చేస్తారు?
క్యాన్సర్ ఆసుపత్రి పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి. కొవిడ్ కారణంగా ఆలస్యం అయిన మాట వాస్తవమే. త్వరితగతిన క్యాన్సర్ ఆసుపత్రిని పూర్తిచేసేందుకు నావంతుగా ప్రయత్నిస్తాను.
రోగులు, వైద్యులు, సిబ్బంది కోసం గ్రీవియన్స్ సెల్ ఏమైనా పెట్టే అవకాశం ఉందా?
ఆసుపత్రిలో ఇప్పటికే గ్రీవియన్స్ సెల్ ఉంది. దానిని మరింత పటిష్ఠం చేస్తాం. రోగులు, సిబ్బంది, వైద్యులు ఎవరైనా తమ సమస్యలు చెప్పుకోవచ్చు. వాటిని వెంటనే పరిష్కరిస్తాం.
ఫైల్స్ ఎప్పటికప్పుడు పూర్తిచేస్తానని మీరు ఈ మధ్యనే చెప్పారు?
నాకు ఎంతో ఇచ్చిన కర్నూలు సర్వజన వైద్యశాల, కర్నూలు మెడికల్ కళాశాల రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. నేను ఇక్కడే ఎండీ చదివాను. అసిస్టెంట్ ప్రొఫెసర్ గా మెడిసిన్ లో పనిచేశాను. నెఫ్రాలజీ హైదరాబాద్ లో చేసి వచ్చిన తర్వాత కూడా... జనరల్ ఆసుపత్రి నెఫ్రాలజీ విభాగంలో ఇక్కడే పనిచేశాను. ఆసుపత్రి అభివృద్ధికి నా వంతుగా కృషి చేస్తాను. చెప్పటం కంటే చేసి చూపిస్తాను.
ఇవీ చూడండి...