శ్రీశైలం భ్రమరాంభ మల్లిఖార్జునస్వామి దేవస్థానం సమీపంలోని తొమ్మిదెకరాల విస్తీర్ణంలో ఉన్న 'ఏనుగుల చెరువు' స్వభావాన్ని మార్చొద్దని అధికారులను ఆదేశిస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ కె.సురేశ్ రెడ్డితో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. దేవాదాయశాఖ ఉన్నతాధికారులతో పాటు జలవనరుల శాఖ ఎస్ఈ(కర్నూలు), వీబీ టెక్నోక్రాఫ్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ ఎండీ, సేనాని సుబ్రహ్మణ్య స్వామి ట్రస్టు అధ్యక్షులకు నోటీసులిచ్చింది. చారిత్రక ఏనుగుల చెరువు భూమిని సుబ్రహ్మణ్య స్వామి గుడి నిర్మాణానికి, ల్యాండ్‌స్కేప్ ఏర్పాటుకు వీబీ టెక్నోక్రాఫ్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థకు అధికారులు కేటాయించడం సరికాదంటూ అఖిల భారత వీరశైవ ధార్మిక ఆగమ పరిషత్ ఛైర్మన్ సంగాల సాగర్, మరొకరు హైకోర్టులో పిల్ వేశారు. విరాళాల సేకరణ ద్వారా గుడి నిర్మాణానికి మాజీ ఐఏఎస్ అధికారి అజేయకల్లం ఫౌండర్ ట్రస్టీ, ఛైర్మన్‌గా ఉన్న సేనాని సుబ్రహ్మణ్య స్వామి ట్రస్టుతో వీబీ టెక్నోక్రాఫ్ట్స్ ఒప్పందం చేసుకుందన్నారు.
గురువారం జరిగిన విచారణలో పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... ఏనుగుల చెరువును ఇతర నిర్మాణాలకు అనుమతించడం చట్ట విరుద్ధం అన్నారు. చెరువుతోనే మల్లిఖార్జున స్వామి దేవాలయంలోని నాలుగు పవిత్ర బావులకు పుష్కలంగా నీరు వస్తుందన్నారు . ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం .. చెరువు స్వభావాన్ని మార్చడానికి వీల్లేదని ఆదేశించింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
ఇదీ చదవండి
ఉద్ధండరాయునిపాలెంలో పోటాపోటీ ఆందోళనలు..భారీగా పోలీసుల మోహరింపు