కర్నూలు జిల్లాలో వేరుసెనగ విత్తన పంపిణీ కొనసాగుతోంది. 230 ఆర్బీకేలలో 21 వేల క్వింటాళ్ల వేరుసెనగ విత్తన కాయల నిల్వలు ప్రస్తుతం అందుబాటులో ఉంచామని ఏపీ సీడ్స్ జిల్లా మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటివరకు రూ.80 లక్షల వరకు నాన్ సబ్సిడీని రైతులు చెల్లించారు. ఆర్బీకేల ద్వారా 10 వేల క్వింటాళ్ల విత్తనాన్ని పంపిణీ చేశామని అధికారులు పేర్కొంటున్నారు. ఏపీ సీడ్స్ ద్వారా 52 వేల క్వింటాళ్ల విత్తనాన్ని సేకరించి ప్రాసెసింగ్ చేయగా.. ప్రస్తుతం 41 వేల క్వింటాళ్ల కె-6 రకం వేరుసెనగ విత్తనాన్ని రైతులకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచారు. ముందుగా చిన్న, సన్న కారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల్లో ఇస్తున్నట్లు రైతులకు అవగాహన కల్పించాలని జేడీఏ ఉమామహేశ్వరమ్మ ఇప్పటికే వ్యవసాయాధికారులను ఆదేశించారు. కాగా ప్రభుత్వం 30 కిలోల బస్తా రూ.1,562.40లను రాయితీపై విక్రయిస్తున్నారు. అయితే బహిరంగ మార్కెట్‌లోనూ ఇదే ధరకు లభిస్తుండటం గమనార్హం. దీంతో రైతులు ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా చాలా కేంద్రాల్లో అన్నదాతల జాడే కానరావడం లేదు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించి కొనుగోలు చేసేలా చర్యలు చేపడుతున్నారు.
50 శాతం రాయితీతో ఇవ్వాలి
ఖరీఫ్ రైతులకు 50 శాతం రాయితీతో వేరుసెనగ విత్తనం సరఫరా చేయాలి. ఐదు ఎకరాలకు సరిపడా విత్తనాలు ఇవ్వాలి. ఒక రైతుకు గరిష్ఠంగా మూడు బస్తాలు ఇస్తే రెండెకరాలకే సరిపోతాయి. ఐదు ఎకరాలకు సరిపడా పది బస్తాల విత్తనాలు ఇస్తే మేలు జరుగుతుంది. ఈ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలి. - ప్రభాకర్‌రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి
ఇదీ చదవండీ.. పూజారి దాతృత్వం.. ఏడాదిగా నిత్యం అన్నదానం