కర్నూలుకు చెందిన ఆర్.కే.వెంకటేశ్వర్లు కొన్ని ఏళ్ల కిందట ఆర్మీకి ఎంపికయ్యారు. డెహ్రుడూన్‌లో శిక్షణకు వెళ్లేందుకు దిల్లీలో రైలెక్కుతూ కిందపడి కాళ్లు పోగొట్టుకున్నారు. ఆ సమయంలో 16 యునిట్ల రక్తం అవసరం కాగా దాతలు సహయంతో వెంకటేశ్వర్లు ప్రాణపాయం నుంచి తప్పించుకున్నారు. తన ప్రాణాన్ని కాపాడిన రక్తదాతలనే స్పూర్తిగా తీసుకొన్న వెంకటేశ్వర్లు... ఇప్పటి వరకు 17సార్లు రక్తదానం చేశారు. కాళ్లు లేకున్నా ఇతరుల్లో స్ఫూర్తి నింపుతున్న ఆయన్ని... కర్నూలు జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అభినందించారు.
స్పూర్తిదాయకం.. ఈయన జీవితం
యువభారత్ సేవా సమితి స్వచ్ఛంద సంస్థ ద్వారా దేశనాయకుల జయంతి రోజుల్లో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తుంటారు. ఈ సేవా సమితి సభ్యులు... వెంకటేశ్వర్లు జీవితాన్నే పాఠంగా వివరిస్తూ ఎంతో మందిని రక్తదాతలుగా మారుస్తున్నారు. కాళ్లు కోల్పోయానని బాధతో విధిని దూషిస్తూ కూర్చోకుండా... సేవా దృక్పథంతో ముందుకు సాగుతున్నారు వెంకటేశ్వర్లు. తన మార్గాన్ని మరెందరో ఎంచుకునేలా స్ఫూర్తి నింపుతున్నారు.