ఖరీఫ్ పంటగా కర్నూలు జిల్లాలో ఈ ఏడాది 2.66 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేశారు. వర్షాలు సకాలంలో పడటంతో ఎకరాకు 8 నుంచి 15 క్వింటాళ్ల మేర దిగుబడులు వచ్చాయి. బయట విపణిలో ధర లేకపోవడం.. సీసీఐ కేంద్రంలో క్వింటా రూ.5,850 ఉండడంతో తమ పంట అమ్ముకునేందుకు సాగుదారులు బారులు తీరుతున్నారు. ముందుగా రైతు భరోసా కేంద్రంలో అన్నదాతలు పేర్లు నమోదు చేసుకుంటే టోకెన్లు జారీ చేస్తారు. అప్పటినుంచి రేయింబవళ్లు పడిగాపులు కాస్తూ వేచి చూడాల్సిందే. ఆదోనిలో 3, ఎమ్మిగనూరులో 3, నంద్యాలలో 2, కోడుమూరులో ఒకటి చొప్పున తొమ్మిది కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద సరకుతో రైతులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. 1600 మంది రైతులు రోజూ దిగుబడులు విక్రయిస్తున్నారు. ఎమ్మిగనూరులో దాదాపు 42 వేల క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే రైతుల ముసుగులో కొందరు దళారులు ముందస్తుగా దిగుబడులు అమ్ముకుంటుండటంతో వ్యవసాయదారులు వేచిచూడాల్సి వస్తోంది.
ఉపవాసం ఉంటున్నాం
ఈ ఏడాది పంట బాగా పండింది. కోతలు తీసి దిగుబడులను అమ్మకానికి తెచ్చాం. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలన్నారు. ఊరిలో నమోదు చేసినా చరవాణికి సందేశం రాలేదు. ఎమ్మిగనూరు వచ్చి రెండుసార్లు అడిగాను. పాసు పుస్తకాలు తీసుకుని రెండు రోజుల నుంచి వేచి ఉన్నాం. ఒక మిల్లు నుంచి మరొక మిల్లుకు మారుస్తున్నారు. వాహనాలకు రెండు రోజుల బాడుగ చెల్లించాల్సిందే. ఎప్పుడు కొంటారోనని ఉపవాసం ఉండి మరీ ఎదురుచూస్తున్నాం. - సుంకన్న, పులకుర్తి
టోకెన్ల జారీలో జాప్యం లేదు
రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేసిన వారినే తీసుకుంటున్నారు. ఒక్కో కేంద్రానికి రోజూ 120 టోకెన్లు జారీ చేస్తున్నాం. నిబంధనల మేరకు కొనుగోలు చేస్తున్నాం. ఎక్కడా నిర్లక్ష్యం చేయడం లేదు. నమోదు చేసిన ప్రకారం అమ్మకానికి తెచ్చిన సరకు కొంటాం. ఇప్పటి వరకు రూ.24 కోట్ల విలువ చేసే పత్తిని కొనుగోలు చేశాం. రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తాం. ప్రైవేటు మిల్లుల్లో స్థలం కొరత ఉంది. దీంతో రహదారిలో నిలిపివేస్తున్నారు. అనుకున్న సమయానికి సరకు కొనుగోలు చేసి పంపిస్తాం. - చంద్రకాంత్, భవానీ ప్రసాద్, సీసీఐ మేనేజర్లు
ఇదీ చదవండి: భూముల రీసర్వేకు వేగంగా సన్నాహాలు