కర్నూలు జిల్లాలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఒకటి రెండు కేసులు మాత్రమే నమోదు కాగా.. ప్రస్తుతం పదుల సంఖ్యలో కేసులు రికార్డు అవుతుండటం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది.
కర్నూలు జిల్లాలో గతేడాది కరోనా కేసులు, కొవిడ్ మరణాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. మహమ్మారిని కట్టడి చేసేందుకు కఠినమైన లాక్ డౌన్ విధించాల్సి వచ్చింది. అధికారుల కృషి కారణంగా.. కొవిడ్ పూర్తి స్థాయిలో నియంత్రణలోకి వచ్చింది. జనవరి నెల నుంచి ప్రజలు మాస్కులు లేకుండా, నిబంధనలు పాటించకుండా.. ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారు. ఇక మీదట తమకు ఎలాంటి భయం లేదని భావించారు. తాజాగా.. కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటం.. ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.
పత్తికొండ పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో.. ఆరుగురు విద్యార్థులకు కరోనా సోకింది. దీంతో పాఠశాలను మూసేశారు. ఆదోని పట్టణంలో కోవిడ్ లక్షణాలతో.. ఎస్కేడీ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీల్లో ముగ్గురికి కరోనా సోకటం ఆందోళన కలిగిస్తోంది. 15వ తేదీన 20 మందికి, 16వ తేదీన 15 మందికి కరోనా సోకినట్లు.. అధికారులు తెలిపారు. విద్యార్థులు, ప్రజలు మాస్కులు ధరించకపోవటం, భౌతిక దూరం పాటించకపోవటం, చేతులు శుభ్రం చేసుకోకపోవటం తదితర కారణాల వల్ల కరోనా కేసులు పెరుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇదీ చదవండి: బిందెడు నీటి కోసం.. ప్రమాదకర ప్రయాణం