CM Jagan visited joint Kurnool district: రాయలసీమ బిడ్డగా.. ఆ ప్రాంత ప్రజల నీటి అవసరాలను తీర్చే దిశగా కార్యక్రమాలు చేపడుతున్నానని.. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా క్రిష్ణగిరి మండలంలో రూ.224 కోట్లతో నిర్మించిన లక్కసాగరం పంప్ హౌస్‌ను ఆయన ప్రారంభించారు. ఈ పంపుహౌస్ ద్వారా 77 చెరువులకు నీరు అందించే కార్యక్రమాన్ని నేటి నుంచి ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. అనంతరం డోన్‌లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని పంప్ హౌస్ వివరాలను వివరించారు.
CM Jagan Comments: సీఎం జగన్ బహిరంగ సభలో మాట్లాడుతూ..''హంద్రీనీవా సుజల స్రవంతి పథకం ద్వారా డోన్, పత్తికొండ, ఆలూరు, పాణ్యం నియోజకవర్గాల్లోని 77 చెరువులకు నీటిని నింపే ప్రాజెక్టును ఈరోజు ప్రారంభించటం సంతోషంగా ఉంది. శ్రీశైలం జలాశయం పక్కనే ఉన్నా.. గత ప్రభుత్వాలు రాయలసీమకు నీరందించే ప్రయత్నం చేయలేదు. సీమ ప్రజల నీటి కష్టాలు తెలిసినవాడిగా.. ఈ నాలుగేళ్లలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేశాను. అందరికీ సామాజిక న్యాయం అందించటమే మన ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. మంచి జరిగితే మీ బిడ్డకు తోడుగా నిలబడండి.'' అని జగన్ కోరారు.
Irrigation and Drinking Water for 10,394 Acres: అనంతరం లక్కసాగరం పంప్‌హౌస్ ద్వారా హంద్రీనీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ నుంచి సాగు, తాగునీరు సరఫరా కానున్నాయని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. దీని ద్వారా డోన్, పత్తికొండ, ఆలూరు, పాణ్యం నియోజకవర్గాల్లో 77 చెరువులు జలకళను సంతరించుకోనున్నాయన్నారు. ఈ పంప్‌హౌస్ వల్ల 10,394 ఎకరాలకు సాగునీరు, 3 నియోజకవర్గాలకు తాగునీరు అందనుందన్నారు. ఈ కరవు ప్రాంతాలను సస్యశ్యామలం చేసేలా నూతన ప్రాజెక్టులు చేపడుతున్నట్లు సీఎం జగన్ వివరించారు.
CM Jagan on Gajuladinne Project: నీటి విలువ, రాయలసీమ నీటి కష్టాలు తెలిసిన ప్రభుత్వం కాబట్టే అధికారంలోకి వచ్చిన వెంటనే సాగునీరు, తాగునీరు అందించే చర్యలు తీసుకున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు. గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి పత్తికొండ నియోజకవర్గంలోని 27 గ్రామాలకు, కృష్ణగిరి మండలంలోని 55 గ్రామాలకు, డోన్ మున్సిపాలిటీ, పత్తికొండ ప్రాంతాలకు తాగునీరు అందిస్తామన్నారు. నీటి కొరత సమయంలో కర్నూలు నుంచి నీటిని సరఫరా చేస్తున్నారని వివరించారు. ఇన్ని రకాలుగా ఉపయోగపడే గాజులదిన్నె ప్రాజెక్టు సామర్థ్యాన్ని 4.5 టీఎంసీల నుంచి 5 టీఎంసీలకు అధికారంలోకి వచ్చాక పెంచామని సీఎం గుర్తు చేశారు.
CM Jagan Visited Tirumala Srivari: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం జగన్
CM Jagan on R&R Package: తాను అధికారంలోకి రాకముందు.. చిత్రావతి, పైడిపాలెం, బ్రహ్మంసాగర్, గండికోట ప్రాజెక్టులకు నీరు ఇవ్వలేని పరిస్థితి ఉండేదని..సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను ముఖ్యమంత్రి అయ్యాక ప్రతి ప్రాజెక్టు కెపాసిటి పెంచామని, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇచ్చి పూర్తి స్థాయిలో నీటిని నింపుతున్నామన్నారు. గతానికి ఇప్పటికి మధ్య ఉన్న తేడాను గమనించాలని ప్రజలను కోరారు. ప్రతిపక్షనాయకుల అబద్ధాలను నమ్మవద్దని, మోసాలు, అబద్ధాలు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువవుతాయని సీఎం పేర్కొన్నారు.
చంద్రబాబు తొమ్మిదేళ్లు సీఎంగా ఉండి హంద్రీనీవాకు ఖర్చు చేసింది రూ. 13 కోట్లు. వైయస్‌ఆర్ ముఖ్యమంత్రి అయ్యాక రూ.6వేల కోట్లతో కాల్వను నిర్మించారు. ఈరోజు ఆ ప్రధాన కాల్వపై తుములు పెట్టి లిప్టుల ద్వారా నీరు చెరువులకు తీసుకువెళ్తున్నాం. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు తీసుకెళ్లడానికి అడుగులు పడుతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి హయాంలో ఒకటో టన్నల్ 12 కిలోమీటర్లు పూర్తి అయితే, 2వ టన్నల్‌లో 8 కిలోమీటర్లు పూర్తి చేశాం. అక్టోబర్ నెలలో 1వ టన్నల్ పనులు పూర్తి చేసి, జాతికి అంకితం చేస్తాం.- వైఎస్ జగన్, రాష్ట్ర ముఖ్యమంత్రి