CM Jagan Released Jagananna Chedodu funds: ఎలాంటి వివక్ష లేకుండా సంక్షేమ పథకాలను ప్రజలందరికీ అందిస్తున్నట్లు సీఎం జగన్ పునరుద్ఘాటించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జగనన్న చేదోడు (jagananna chedodu) పథకం నిధులను ఆయన విడుదల చేశారు. జగన్ ప్రసంగం మొదలుకాకముందే జనం వెనుదిరగడం.. వైసీపీ నేతలకు ఉసూరుమనిపించింది. ప్రతి అడుగులోనూ... ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేదలకు మేలు చేస్తున్నామని సీఎం అన్నారు. గతంలోపథకాలు ఏవీ అమలు కాలేదన్నారు. రాష్ట్రానికి ఎన్నో కంపెనీలు తెచ్చి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచినట్లు చెప్పారు. అమూల్, ఐటీసీ, రిలయన్స్, హిందుస్తాన్ యూనిలీవర్(Hindustan Unilever) లాంటి సంస్థలను తీసుకురావడమే కాకుండా బ్యాంకులతో అనుసంధానం చేసి పేదలకు తోడుగా ఉన్నామన్నారు.
CM Camp Office At Visakha: విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం, మంత్రులకు వసతిపై కమిటీ
నేరుగా వారి ఖాతాల్లోకి డబ్బులను విడుదల: వెనుకబడిన కులాలు, వర్గాలను… వెన్నెముక మాదిరిగా దృఢంగా మారుస్తున్నామని సీఎం జగన్ అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జగనన్న చేదోడు పథకం నిధులను బటన్‌నొక్కి విడుదల చేశారు. గత నాలుగున్నర సంవత్సరాలుగా జగనన్న చేదోడు పథకం ద్వారా రూ.1251 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలిపారు. 52 నెలల పాలనలో నవరత్నాలన్నీ.. అమలు చేసినట్లు చెప్పారు. సొంత షాపులున్న రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు ఏటా 10 వేల రూపాయల, ఆర్థిక సాయం చేస్తున్నట్లు చెప్పారు. నేరుగా వారి ఖాతాల్లోకి డబ్బులను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. తద్వారా 3లక్షల 25వేల మంది లబ్ధి పొందినట్లు సీఎం జగన్ వెల్లడించారు. వైసీపీ (YCP) ప్రభుత్వంలో ఎలాంటి వివక్ష లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. సీఎం జగన్ పర్యటన వేళ రహదారులను మూసివేయడంతో.. ప్రజలు అవస్థలు పడ్డారు. గ్రామాల నుంచి జనాన్ని బస్సుల్లో తరలించిన అధికారులు.. వేదికకు దూరంగా నిలిపివేయడంతో నడుచుకుంటూ సభకు చేరుకునేందుకు ఇబ్బందిపడ్డారు. సీఎం జగన్ ప్రసంగిస్తుండగానే.. చాలా మంది మహిళలు సభ నుంచి వెళ్లిపోయారు.
టీడీపీ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు: సీఎం పర్యటన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ప్లకార్డులు, నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. గతంలో టీడీపీ (TDP) హయాంలో మంజూరు చేసిన ఆర్డీఎస్ ప్రాజెక్టు, టెక్స్ టైల్స్ పార్కు, త్రాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని తెలిపారు. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేసి ఎమ్మిగనూరు పర్యటనకు రావాలంటూ నినదించారు. పోలీసులు మాజీ ఎమ్మెల్యే బీవీతో పాటు తెలుగుదేశం పార్టీ శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు.