రెండు తెలుగు రాష్ట్రాల్లో గొప్పలు చెప్పుకుంటున్న పార్టీలు అవినీతికి, కులానికి, ఒకే కుటుంబానికి పరిమితమయ్యాయని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో నిర్వహించిన ఓబీసీ మోర్చా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాజపా నాలుగు రాష్ట్రాల్లో విజయం సాధించటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ భాజపా కేంద్రంలో అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. కేంద్రంలో భాజపా అధికారంలోకి వస్తేనే.. అన్ని వర్గాల ప్రజలకూ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. జాతీయ పార్టీగా చెప్పుకొనే కాంగ్రెస్.. దేశంలోనూ, రాష్ట్రంలోనూ తుడిచిపెట్టుకుపోయిందని దుయ్యబట్టారు.
కల్తీసారా ఘటన ప్రభుత్వ వైఫల్యమే: సత్య కుమార్
జంగారెడ్డిగూడెం కల్తీసారా ఘటన ప్రభుత్వ వైఫల్యమేనని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు. ఐదుగురే చనిపోయారని మంత్రి చులకనగా మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. కల్తీ మద్యాన్ని అరికట్టలేని వైకాపా ప్రభుత్వం.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని ఆరోపించారు. కల్తీసారా ఘటనకు వైకాపా ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.
అమరావతి రాజధానికి భాజపా కట్టుబడి ఉందని, అమరావతికి కేంద్రం సహాయ సహకారాలు అందిస్తోందని తెలిపారు. హైకోర్టు తీర్పు తర్వాత కూడా రాష్ట్ర బడ్జెట్‌లో రాజధాని అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడం దారుణమని సత్యకుమార్ అన్నారు. కోర్టు తీర్పుతో రాజధానిపై స్పష్టత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సంస్థల ఏర్పాటుతో దిల్లీ పెద్దలతో మాట్లాడతామని చెప్పారు. ఇదే సమయంలో మూడేళ్ల వైకాపా పాలనపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఇదీ చదవండి
రెండో విడత బడ్జెట్ సమావేశాలు.. అస్త్రాలతో పాలక, విపక్షాలు సిద్ధం