కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మండలం ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో బంగారం మాయమైన ఘటనలో.. పోలీసులు రెండు రోజుల వ్యవధిలోనే చోరీకి కారణమైన నిందితులను అరెస్టు చేశారు. బ్యాంకులో పొరుగు సేవల కింద అటెండర్‌గా పని చేస్తున్న కాశీ విశ్వనాథ్‌ను సూత్రధారిగా నిర్ధరించారు. పోలీసులు క్షేత్రస్థాయి విచారణలో భాగంగా.. విశ్వనాథ్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది.
దోపిడీ చేశారిలా...
స్ట్రాంగ్ రూమ్ తాళం చెవులను కాశీ విశ్వనాథ్ దొంగిలించి, మరొకటి తయారు చేయించి.. వాటి సహాయంతో ఈనెల 11న ఖాతాదారుల ఆభరణాలను దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు. బ్యాంకు బయట తన స్నేహితుడు సుబ్రహ్మణ్యంను కాపలా ఉంచి.. అనుమానం రాకుండా బ్యాంకులో వస్తువులు దోపిడీ చేశారన్నారు. మిత్రుడి ఇంటిలో దాచిపెట్టిన బంగారంతో పాటు కాశీ విశ్వనాథ్, సుబ్రమణ్యం సహా కొన్ని ఆభరణాలను కొనుగోలు చేసిన నంద్యాలకు చెందిన కిషన్‌ను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద నుంచి రూ. 8 లక్షల నగదు, 1305 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ చోరీకి బ్యాంకు అధికారుల నిర్లక్ష్యమూ కారణమేనని డీఎస్పీ రాజేంద్ర తెలిపారు.
ఇదీ చదవండి: ట్రక్కు కిందపడి యువకుడు బలవన్మరణం
అసలేం జరిగింది?
ఈనెల 17వ తేదీన ఆభరణాలు తనఖా పెట్టిన ఓ ఖాతాదారుడు.. తన బంగారాన్ని విడిపించుకునేందుకు బ్యాంకుకు వచ్చాడు. స్ట్రాంగ్ రూంలో అతనికి సంబంధించిన వస్తువులు కనిపించలేదు. బ్యాంకు మేనేజర్ లక్ష్మీప్రసాద్ ఆ గదిని క్షుణ్ణంగా పరిశీలించగా.. మొత్తం 18 మందికి చెందిన దాదాపు 1,500 గ్రాముల బంగారం మాయమైనట్లు గుర్తించారు. ఈ విషయంపై వెంటనే ఉయ్యాలవాడ పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సీఐ సుబ్బరాయుడు విచారణ ప్రారంభించారు. రెండు రోజుల్లోనే నిందితులను పట్టుకున్న సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
ఇదీ చదవండి: