Avuku Tunnel Project Progress : "మన అందరికీ కనిపిస్తోంది అవుకు రిజర్వాయర్. ఇంతవరకు నాలుగు సంవత్సరాలు పూర్తైంది. టన్నెల్ నిర్మాణ పనులు పూర్తయ్యాయా అని అడుగుతున్నాను? పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కుల ఫ్లడ్ ఫ్లో డిశ్చార్జితో కాలువ పనులు పూర్తిచేస్తే.. రాయలసీమే కాదు.. ప్రకాశం, నెల్లూరు జిల్లాల వరకు ప్రతి ప్రాజెక్టు ఈ రోజు కళకళలాడుతుండేది. చంద్రబాబునాయుడు పుణ్యాన నాలుగు సంవత్సరాలైనా ప్రాజెక్టుల్లో నీళ్లుఉండవు." - 2017 జనవరి 6న ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో బనగానపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు ఇవి..
Avuku Reservoir Construction works : ప్రతిపక్ష నేతగా జగన్ అవుకు టన్నెల్‌పై ఎంత ప్రేమ ఒలకబోశారో? తెలుగుదేశం ప్రభుత్వం టన్నెల్ పూర్తి చేయలేదంటూ ఎంత ఆగ్రహం వ్యక్తం చేశారో? ఆ టన్నెల్ నుంచి నీళ్లు తరలిస్తే ఎన్ని ప్రాజెక్టులు కళకళలాడి ఉండేవని ఆక్రోశం వెళ్లగక్కారో? సీమకు, కోస్తా జిల్లాలకు ఆ నీళ్లు ఎంతో ఉపయోగపడి ఉండేవని నాడు తెగ బాధ పడిపోయారు. తామే అధికారంలో ఉంటే ఎప్పుడో ఆ టన్నెల్ పూర్తి చేసి ప్రాజెక్టులు కళకళ లాడించేవాడిని అన్నట్లుగా బహిరంగంగానే ప్రజలను నమ్మబలికారు.
నత్తనడకన అవుకు, వెలిగొండ టన్నెల్ పనులు.. గడువులోగా పూర్తవటం కష్టమే..!
జగన్ మాటలు నమ్మి అధికారం ఇచ్చి నాలుగున్నరేళ్లయినా ఇప్పటికీ టన్నెల్ పనుల్లో కదలిక లేదని రైతులు వాపోతున్నారు. అవుకు టన్నెళ్ల నుంచి ఇప్పటికీ పూర్తిస్థాయిలో నీళ్లు వదిలేలా పనులు ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రశ్నిస్తున్నారు. ఏడాదిలోనే అవుకు సొరంగాలు పూర్తి చేస్తామంటూ పలికిన పలుకులేమయ్యాయని నిలదీస్తున్నారు. ఐదు తొలి ప్రాధాన్య ప్రాజెక్టులు ఏడాదిలోనే పూర్తిచేస్తామంటూ.. అందులో అవుకు సొరంగాలు చేర్చారు కదా! ఇప్పటికీ ఆ మాట నెరవేర్చలేదేం అని రాయలసీమ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ హయాంలో ప్రాజెక్టుకు బీజం : కడప జిల్లా సాగునీటి అవసరాలు తీర్చాలన్న ఉద్దేశంతో చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ సొరంగ మార్గాల పనులు ప్రతిపాదించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2008 జనవరిలో పనులు ప్రారంభమయ్యాయి. 2009 తర్వాత పనులు ఆగిపోయాయి. 2014లో చంద్రబాబు మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి.
సుమారు 401 కోట్ల రూపాయల విలువైన ఆయా పనులను N.C.C., మైటాస్ సంస్థలు చేపట్టాయి. 12 మీటర్ల ఎత్తు, 12 మీటర్ల వెడల్పున ఏకంగా 5.6 కిలోమీటర్ల దూరం పాటు కొండలను తొలచి రెండు సొరంగ మార్గాలు తవ్వాలి. ఒక్కో సొరంగ మార్గాన్ని 10 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యంతో నిర్మించాలి. అత్యంత సంక్లిష్టమైన ఆ ప్రక్రియలో పలు ఆటంకాలు ఎదురయ్యాయి.
ఒక సొరంగ మార్గమధ్యంలో సుమారు 280 మీటర్ల దూరం పాటు ఫాల్ట్‌జోన్ ఉన్నట్లు తేలింది. అంటే.. అక్కడ సొరంగం తవ్వినా ఆ పని నిలిచే అవకాశం లేదు. దీంతో సొరంగమార్గాన్ని మళ్లించాల్సి వచ్చింది. రెండో సొరంగ మార్గంలోనూ 165 మీటర్ల పొడవునా ఫాల్ట్‌జోన్ ఉన్నట్లు తేలింది. దీంతో రెండో సొరంగమార్గంలో మరో రెండు చిన్న మళ్లింపు సొరంగాలను నిర్మించాల్సి వచ్చింది. ఆయా పనులు జరుగుతున్న సమయంలో ప్రభుత్వం మారి.. వైకాపా అధికారంలోకి వచ్చింది..
రివర్స్ టెండరింగ్.. గుత్తేదారు మార్పు : వైసీపీ అధికారంలోకి వచ్చాక.. రివర్స్ టెండరింగ్ పేరుతో మ్యాక్స్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థకు.. 108 కోట్ల రూపాయలతో మిగిలిన పనులు అప్పగించారు. జగన్ హయాంలో పనులు నెమ్మదించాయి. బిల్లులు సకాలంలో ఇవ్వకపోవడంతో పనుల వేగం తగ్గిపోయింది. ''రెండో టన్నెల్‌లోని ఫాల్ట్‌జోన్‌లో కొంత మేర పాలియురేథిన్ ఫోమ్ గ్రౌటింగ్ చేయాల్సి వచ్చింది. కేవలం 149 మీటర్ల లైనింగ్ పనుల నిర్మాణం మాత్రమే మిగిలిందని''.. అధికారులు సమీక్ష సమావేశంలో చెబుతున్నా వాస్తవానికి ఇంకా 11 వందల మీటర్ల లైనింగ్ పని పెండింగులో ఉన్నట్లు అధికారిక సమాచారం.
CM Jagan Fake Propaganda on State Progress: "వేదికేదైనా.. అలవోకగా అబద్ధాలు". ఇదీ మన ముఖ్యమంత్రి తీరు
సొరంగం మొత్తానికి సుమారు అరమీటరు మందాన కాంక్రీటు లైనింగ్ వేస్తే.. చెక్కుచెదరకుండా ఉంటుంది. ఫాల్ట్‌జోన్ వల్ల బైపాస్ చేసి నిర్మించిన మార్గాన్ని ఈ మధ్య ఐఐటీ నిపుణులు పరీక్షలు చేశారు. లైనింగ్ లేకపోయినా నీటిని విడుదల చేయవచ్చని తేల్చడంతో.. ఆ పని చేయకుండానే రెండు సొరంగ మార్గాలు ప్రారంభించాలనే ఆలోచనతో అధికారులు ఉన్నారు. లైనింగ్ పనులు ఆ తర్వాత ఎప్పుడైనా చేయవచ్చని భావిస్తున్నారు.
ఆడిట్ పాయింట్ దగ్గర నిర్మించాల్సిన భారీ కాంక్రీటు గోడ నిర్మాణం అగమ్యగోచరంగా మారింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత నిర్మాణంలో ఉన్న రెండు సొరంగ మర్గాలకు అదనంగా మరో సొరంగ మార్గాన్ని నిర్మించే బాధ్యతను "రాఘవేంద్ర కన్‌స్ట్రక్షన్స్ సంస్థ"కు అప్పగించింది.
ఈ పనులు కూడా పూర్తి అయితే దీని నుంచి కూడా మరో 10 వేల క్యూసెక్కుల నీటిని రిజర్వాయర్‌కు తరలించవచ్చు. వీటి నిర్మాణ పనులు పూర్తి కావడానికి ఇంకా సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు.
అక్టోబర్‌లో అవుకు టన్నెల్ ద్వారా సాగునీరు.. సీఎం నిర్దేశం