APJAC Agitation: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో మలిదశ ఉద్యమం కర్నూలు జిల్లాలో కొనసాగుతుంది. ఉద్యమంలో భాగంగా.. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మరణించిన ఉద్యోగి ఇంటికి ఏపీ జేఏసీ అమరావతి నాయకులు వెళ్లారు. మరణించిన ఉద్యోగి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలని డిమాండ్ చేశారు.
కర్నూలు నగరానికి చెందిన దస్తగిరి అనే ప్రభుత్వ ఉద్యోగి.. విధులు నిర్వహిస్తూ మరణించాడు. ఉద్యోగి మరణించి మూడు నెలలైనా ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి ఎటువంటి సహాయం అందలేదు. దీంతో ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందులకు గురవుతుందని ఏపీ జేఏసీ నాయకులు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా అందకపోవడంతో తాళిబొట్టు అమ్మి.. తన పిల్లలకు పాఠశాల ఫీజులు చెల్లించామని బాధిత మహిళ కన్నీరుమున్నీరుగా విలపించారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి కారుణ్య నియామకాల్లో బాధిత కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలని ఏపీ జేఏసీ అమరావతి కర్నూలు జిల్లా అధ్యక్షుడు గిరి కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు చెయ్యనందున అనేక కుటుంబాలు ఇబ్బందులకు గురవుతున్నాయని వారు తెలిపారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఇచ్చిన హామీ ప్రకారం సీపీఎస్ రద్దు చేయాలని కోరారు.
"నా భర్త టీచర్‌గా ఉద్యోగం చేస్తూ జనవరి 6వ తేదీన మరణించారు. చనిపోయి 3 నెలలు అవుతున్నా.. అతనికి సంబంధించి ఎటువంటి పింఛన్ కానీ, ఇతర బెనిఫిట్స్ కానీ రాలేదు. మేము ఆర్థికంగా చాలా కష్టపడుతున్నాం. రెంట్ కూడా కట్టుకోలేక.. ఇల్లు ఖాళీ చేసి మా అమ్మవారింటికి వచ్చేశాను. మేము ఆర్థికంకా చాలా వెనుకపడిన వాళ్లం. పిల్లలకి ఫీజు కూడా కట్టలేక.. నా తాళిబొట్టు అమ్ముకొని మరీ స్కూల్లో ఫీజు కట్టాను.
నా భర్త బాగోలేక హాస్పిటల్లో ఉన్నప్పుడు.. 25 లక్షల వరకూ ఖర్చు అయింది. మాకు ఈహెచ్ఎస్ ఏమీ పని చేయలేదు. బయట నుంచి అప్పులు తెచ్చుకొని.. వైద్యం అందించాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ అప్పులు ఏ విధంగా కట్టాలో కూడా అర్థం కావడం లేదు. కాబట్టి ప్రభుత్వం వారు మా కుటుంబాన్ని ఆదుకోవాలని, అదే విధంగా కారుణ్య నియామకం కింద నాకు ఒక ఉద్యోగం ఇచ్చి.. మా కుటుంబం రోడ్డున పడకుండా చూడాలని కోరుతున్నాం". - సునీత, బాధిత మహిళ
"సీపీఎస్ ఉద్యోగులను పట్టి పీడిస్తోంది. సీపీఎస్ వల్ల అనేక మంది బతుకులు రోడ్డున పడుతున్నాయి. ఆ బాధిత కుటుంబాలను ఎవరూ ఓదార్చలేని పరిస్థితి ఉంది. వారిని ఎవరూ పట్టించుకోవడం లేదు. వారికి రావాల్సిన బకాయిలు త్వరితగతిన విడుదల చేయాలి". - గిరికుమార్ రెడ్డి, ఎపీజేఏసీ అమరావతి కర్నూలు జిల్లా అధ్యక్షుడు
ఇవీ చదవండి: