రాజకీయ పార్టీల నేతలతో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జరిపిన సమావేశం డ్రామాలా ఉందని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. సమావేశాలు రాజ్యాంగబద్ధంగా జరగడం లేదని విమర్శించారు. రాజకీయ పక్షాలను ఒకేచోట కూర్చోబెట్టకుండా... విడివిడిగా రహస్య మంతనాలు చేశారని విమర్శించారు. ఒక్క ఓటు కూడా లేని రాజకీయ పార్టీలను సమావేశానికి పిలిచి చర్చించారన్న ఆయన.. గతంలో ఎన్నికలు వాయిదా వేసే ముందు ఇలా ఎందుకు చేయలేదని నిలదీశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు 3 వేల వరకు కరోనా కేసులు నమోదవుతున్నాయని... ఈ పరిస్థితుల్లో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని అంబటి ప్రశ్నించారు. స్థానిక ఎన్నికలకు తాము భయపడేది లేదన్న ఆయన.. కరోనా తీవ్రత తగ్గాకే నిర్వహించాలన్నది తమ పార్టీ అభిప్రాయమని చెప్పారు. రాష్ట్రంలో ఎప్పుడు స్థానిక ఎన్నికలు జరిగినా వైకాపా అద్వితీయ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: