రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 'వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష పథకం' ప్రారంభం కానుంది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం ఉదయం 10 గంటలకు దీనికి లాంఛనంగా శ్రీకారం చుట్టనున్నారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్లో తక్కెళ్లపాడుకు చేరుకోనున్న సీఎం... గ్రామ పొలిమేరలోని పొలాల్లో సర్వే హద్దు తొలి రాయిని ప్రతిష్టించనున్నారు. అనంతరం అన్ని జిల్లాల్లో భూముల రీ సర్వే ప్రారంభం కానుంది.
జగ్గయ్యపేటలో బహిరంగ సభ
ఇప్పటికే తక్కెళ్లపాడులో ప్రయోగాత్మకంగా రీ-సర్వే పూర్తి చేశారు. పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావటంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్నారు. రీ సర్వే కోసం సర్వే ఆఫ్ ఇండియా సంస్థతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సోమవారం జగ్గయ్యపేటలో జరిగే బహిరంగ సభలో తక్కెళ్లపాడు గ్రామ రైతులకు 'వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు- భూ రక్ష పథకం' కింద ల్యాండ్ టైటిళ్లను పంపిణీ చేయనున్నారు.
దశలవారీగా ప్రక్రియ
సోమవారం ప్రారంభమయ్యే భూమల రీసర్వే ప్రక్రియ దశల వారీగా 2023 జనవరితో పూర్తి చేసేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. సర్వే పూర్తయ్యాక ఒక టైటిల్ను గ్రామ సచివాలయంలో పరిశీలన కోసం ఉంచుతారు. వీటిపై అభ్యంతరాలు వస్తే... వాటన్నింటినీ పరిష్కరించి రెండేళ్ల తర్వాత మరో టైటిల్ ఖరారు చేస్తారు. అప్పటికీ అభ్యంతరాలుంటే ప్రభుత్వమే పరిహారం చెల్లిస్తుంది.
ఇదీ చదవండి