ఆర్థిక శాఖలో నిధుల ఖర్చుపై కాగ్ స్పష్టత కోరితే.. ఏదో జరిగిపోయినట్లు పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ మాట్లాడుతున్నారని వైకాపా ఎమ్మెల్యే కిలారు రోశయ్య అన్నారు. సాఫ్ట్వేర్ లోపం కారణంగా నిధుల ఖర్చుపై స్పష్టత రాలేదని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వివరించినా ఆర్థం చేసుకోలేదని ఎద్దేవా చేశారు. తెదేపా హయాంలో రూ.300 కోట్లు ఖర్చుతో సీఎఫ్ఎంఎస్ విధానాన్ని తీసుకువచ్చి దానిని ఓ ప్రైవేట్ వ్యక్తి చేతిలో పెట్టారని విమర్శించారు. తెలుగుదేశం పాలనలో జరిగిన అవినీతి అంశాలన్నీ ఒక్కొక్కటిగా.. బయటపడుతూనే ఉన్నాయని కిలారు రోశయ్య ఆక్షేపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ.. సీఎం జగన్ సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేస్తున్నారని వెల్లడించారు.
ఇదీ జరిగింది...
రెండేళ్ల వైకాపా పాలనలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి.. అకౌంటింగ్ వ్యవహారాల్లో తప్పిదాలు జరిగాయని ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఆరోపించారు. రూ.40 వేల కోట్ల జమా ఖర్చుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం సరిగా నమోదు చేయలేదని పేర్కొన్నారు. బిల్లులకు రశీదులు, ఓచర్లు లేకుండా వివిధ పద్దుల్లోకి మార్చారని తెలిపారు. జమా ఖర్చుల సమాచారాన్ని ప్రభుత్వం గోప్యంగా ఉంచుతోందని, పద్దులు లేకుండానే భారీ జమా ఖర్చులు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. రాష్ట్ర ఆర్థికశాఖ రికార్డులను కాగ్ ద్వారా సమీక్షించాలని పయ్యావుల కేశవ్ కోరారు.
ఇదీచదవండి.