సీఎం జగన్ నిర్వాకం వల్ల తొలి ఏడాది రాష్ట్రం రూ.65,500కోట్ల రూపాయలను కోల్పోయిందని శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. తనపై ఉన్న 12 ఛార్జీషీట్ల మాఫీ కోసం సీఎం జగన్ రాష్ట్రానికి 12వేల కోట్ల నష్టం చేకూర్చారని దుయ్యబట్టారు. తొలి ఏడాది రాష్ట్రానికి రావాల్సిన 16వేల కోట్ల ఆర్థిక లోటుకు మంగళం పాడారని యనమల అన్నారు. డివల్యూషన్ ఫండ్స్ లో 0.2% కోత, జీఎస్టీ పరిహారం 5వేల కోట్లు, రెవిన్యూ రియలైజేషన్ లో -23.5% కోత, సెంట్రల్ పూల్ నుంచి రాష్ట్రం వాటా 2వేల కోట్లకు తగ్గటం వంటివి కలిపి మొత్తంగా రూ.65,500కోట్లు నష్టం జరిగిందన్నారు. ఇవి తెచ్చుకుని ఉంటే ప్రజలపై అప్పుల భారం తగ్గి విద్యుత్, ఆర్టీసీ, ఇసుక, సిమెంట్, మద్యం ధరలు పెంచాల్సిన పని ఉండేది కాదన్నారు.
సీఎం జగన్ పాపాలే రాష్ట్రానికి శాపాలుగా మారాయని యనమల ఆరోపించారు. రూ. 5కోట్ల మంది ప్రజల భవిష్యత్తును అంధకారం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కేసుల కోసం పోలవరాన్ని ఫణంగా పెట్టారని ఆరోపించారు. ఇకనైనా రాష్ట్రం బాగుకోసం సీఎం జగన్ తన తీరు మార్చుకోవాలని హితవు పలికారు.
ఇదీ చదవండి: తెరుచుకున్న పాఠశాలలు... కొవిడ్ నిబంధనలు తప్పనిసరి