విజయవాడ నగరవాసులకు నీటి మీటర్లతో వస్తున్న బిల్లులు చూసి బుర్ర గిర్రున తిరుగుతోంది. తర్వాత కడదాములే అనుకున్నా, కొద్దిపాటి నిర్లక్ష్యం వహించినా, కాస్తంత ఆలస్యం చేసినా అంతే సంగతులు. ముఖ్యంగా మీటర్లు పాడైపోతే బిల్లులు, అపరాధ రుసుములు భారీగా చెల్లించుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అనేకచోట్ల మీటర్లు పాడైపోవడంతో వాటిని బాగు చేయించుకోలేక పోతున్నారు. ఇక కొత్తవి ఏర్పాటు చేసుకునేందుకు అధికారులు నోటీసులు జారీచేసినా సకాలంలో స్పందించకపోవటం.. బిల్లులు రూ.వేలకు చేరుతున్నాయి. ఎన్నికల వేళ నగరపాలక సంస్థ అధికారులు బిజీగా ఉండటంతో సమస్య సకాలంలో పరిష్కారం కావడంలేదు.
అధికారుల తాజా లెక్కల ప్రకారం నగరంలో 2.7 ఇళ్లు ఉండగా, 1.30 లక్షల ఇళ్లకు కుళాయిలు ఉన్నాయి. వాటిల్లో కమర్షియల్, బహుళ అంతస్తులు, సెమీ రెసిడెన్షియల్, వ్యక్తిగత భవనాలకు ఇటీవల వరకు 9544 నీటి మీటర్లు అమర్చాయి. ప్రస్తుతం వాటి సంఖ్య 10వేలకు చేరింది. మీటర్లు ఉన్న వారిలో అత్యధికులు బిల్లులు చూసి బెంబేలెత్తుతున్నారు.
మూడు నెలలకు రెట్టింపు..
బిల్లుల మోతకు ప్రధానంగా మీటరు తిరగకపోవడం, పాడైపోవడం, మార్చుకోకపోవడం, కొత్తది అమర్చుకోకపోవడం వంటి కారణాలుగా ఉన్నాయి. ఫలితంగా ప్రతి మూడు నెలలకు నీటిబిల్లు కాస్త రెట్టింపు అవుతూ, అపరాధ రుసుమూ దానికి చేరిపోతుంది. నగరపాలక సంస్థ కౌన్సిల్ తీర్మానం, నీటి బైలా, ఇతర నిబంధనల ప్రకారం ఇంజినీరింగ్ అధికారులు ప్రతి రెండు నెలలకు ఒకసారి మీటరు రీడింగ్ తీసి నీటి వాడకం వివరాలను కంప్యూటరీకరిస్తారు. ఆపై వచ్చిన నీటిబిల్లును రెండు నెలలకు విభజించి చెల్లించుకునే వెసులుబాటు కల్పిస్తారు.
ఇక్కట్లు తప్పడం లేదు..
నోటీసు ఇచ్చినా.. మీటరు పాడైపోయినట్లు గుర్తించిన వెంటనే ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది ఇంటి యజమానికి నోటీసు జారీచేస్తున్నారు. మీటరు సరిచేసుకోవాలని, లేకుంటే కొత్తది అమర్చుకోవాలని సూచిస్తారు. ఇది పట్టించుకోకుంటే ఇక్కట్లు తప్పడం లేదు. నగరంలో ఇప్పటికీ 2017 నుంచి నీటి మీటర్లపై బిల్లులు చెల్లించకుండా ఇబ్బంది పడుతున్న వారు చాలా మంది ఉన్నారు.
సమస్య ఇలా..
నీటిమీటర్లు ఉన్న ప్రతి ఇంటికి రెండు నెలలకు ఒకసారి రీడింగ్ తీసి కంప్యూటరీకరిస్తారు. ఆపై నీటిబిల్లు జనరేట్ అవుతుంది. అయితే ఏ మాత్రం మీటరు పాడైపోయినా, తిరగకపోయినా.. గడచిన మూడు నెలల్లో అత్యధిక బిల్లు ఆధారంగా ఆటోమేటిక్‌గా కొత్త బిల్లు తయారు అవుతుంది. ఇలా ప్రతి రెండు నెలలకు ఒకసారి సగటున జనరేట్ అయ్యే బిల్లు.. ఆపై ప్రతి మూడు నెలలకు ఒకసారి రెట్టింపు అయిపోతుంది. దీంతో రూ.300, రూ.400 వచ్చేబిల్లు ఒక్కసారిగా రూ.10 వేల నుంచి రూ.20వేలకు చేరుకుంటుంది. ఇలా బిల్లు జనరేట్ అయ్యాక మార్చుకోవడం ఏమాత్రం కుదరక చెల్లించక తప్పడం లేదు. దీనిని చెల్లించి, వెంటనే నూతన మీటరు అమర్చుకుంటే, ఆ తర్వాత ప్రతి రెండు నెలల నీటి వినియోగం ఆధారంగా మాత్రమే బిల్లు పడుతుంది.
పాడైతే మార్చుకోవాల్సిందే..
నీటి మీటరు పాడైపోతే వెంటనే కొత్తది మార్చుకోవాలి. అలా వదిలేస్తే మూడు నెలలకు ఒకసారి నీటిబిల్లు రెట్టింపు అవుతూనే ఉంటుంది. కంప్యూటర్ ద్వారా బిల్ జనరేట్ అవుతుంది కాబట్టి దానిని సరిచేయడానికి వీలుండదు. బకాయి బిల్లు చెల్లించి కొత్తమీటరు అమర్చుకుంటే ఆ తర్వాత నెల నుంచి నీటివాడకం ఆధారంగా సాధారణ బిల్లు వస్తుంది.
ఇవీ చూడండి... తంగిరాల సౌమ్య పై దాడి జరగలేదు : సీఐ కనకారావు