అమరావతి రాజధానిగా ఏర్పడక ముందు విజయవాడలో సుమారు 100 హోటళ్లు ఉండేవి. రాజధాని వచ్చాక క్రమేపీ నగరంలో వాటి సంఖ్య 250కు పెరిగింది. కరోనా వైరస్ ప్రభావంతో సుమారు 6 నెలలుగా వ్యాపారం లేదు. వీటిని వేరే అవసరాలకు వినియోగించడానికి నిర్వాహకులు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో నగరంలోని సుమారు 20 హోటళ్లు కొవిడ్ చికిత్స అనుబంధ ఆసుపత్రులుగా మారాయి. వీటిని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు లీజుకు తీసుకుని, కొవిడ్ ఆసుపత్రులుగా నడుపుతున్నారు. మరో 40 నుంచి 50 హోటళ్ల వారు కూడా అలా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతమేర గట్టెక్కడానికి ఇలా చేస్తున్నారు. లీజుకు ఇవ్వడం ద్వారా హోటల్ స్థాయిని బట్టి నెలకు రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు వస్తోంది.
- గతంలో రోజుకు 3,500 మంది వరకు బస
కరోనా ప్రభావం లేని రోజుల్లో నగరానికి రోజుకు 2,500 మంది నుంచి 3,500 మంది వరకు హోటళ్లలో బస చేసే వారు. వస్త్ర వ్యాపారులు, ఇతర హోల్ సేల్ వ్యాపారులు, కనకదుర్గ ఆలయానికి వచ్చే యాత్రికులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హోటళ్లలోనే బస చేసేవారు. ప్రస్తుతం కొవిడ్ ప్రభావంతో రవాణా నిలిచిపోవడం, మరోవైపు విశాఖకు రాజధాని తరలింపు వంటి ప్రభావంతో హోటళ్ల వ్యాపారం దెబ్బతిందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద తాము ఏడాది నుంచి నష్టాలను ఎదుర్కొంటున్నట్టు చెబుతున్నారు.
- శానిటైజరుతో పదే పదే శుభ్రం చేయడం వల్లే..
కొవిడ్ బాధితులున్న కారణంగా, హోటళ్లను రోజుకు 3 నుంచి 4 సార్లు శానిటైజర్లుతో శుభ్రం చేయడం, దీనికి విద్యుత్తు షార్టు సర్క్యూట్ తోడవటంతో ఆదివారం స్వర్ణాప్యాలెస్‌లో ప్రమాదం సంభవించి ఉండవచ్చని హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి...