కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని 39 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో కృష్ణానదిపై బృహత్తరమైన ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే సామినేని ఉదయభాను తెలిపారు. జగ్గయ్యపేట మండలం వేదాద్రి గ్రామం వద్ద కృష్ణానదిపై రూ.368 కోట్ల వ్యయంతో ఎత్తిపోతల పథకం నిర్మించనున్నారు.
వేదాద్రి ఎత్తిపోతల పథకానికి 26 కిలోమీటర్ల పైప్లైన్ నిర్మాణం ద్వారా నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలోని డీవీఆర్ బ్రాంచ్ కాలువకు అనుసంధానం చేయనున్నారు. ఇక్కడి నుంచి జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాల పరిధిలోని ఎన్ఎస్పీ ఆయకట్టులోని మేజర్, మైనర్ కాలువలకు సాగునీరు పంపిణీ జరగనుంది. ఇప్పటికే ప్రాజెక్టు పనులు దక్కించుకున్న మేఘా నిర్మాణ సంస్థ సర్వే పనులు పూర్తి చేసింది. ఎత్తిపోతల పనులకు ఈ నెల 28న వేదాద్రి వద్ద భూమి పూజ జరగనుందని ఎమ్మెల్యే ఉదయభాను తెలిపారు. సీఎం జగన్ రిమోట్ కంట్రోల్ ద్వారా పనులు ప్రారంభించనున్నారు.
ఇదే ప్రాజెక్టు గత ప్రభుత్వ హయంలో ముత్యాల ఎత్తిపోతల పథకం పేరుతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. సార్వత్రిక ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో పనులు ముందుగు సాగలేదు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ టెండర్ రద్దు చేసి.. కొత్తగా టెండర్లు పిలిచింది.
ఇదీ చదవండి: పసిబిడ్డను వదలివెళ్లటానికి చేతులెలావచ్చాయి..