కృష్ణా జిల్లా విజయవాడలోని కనకదుర్గ పైవంతెనపై భారీ వాహనాల రాకపోకలపై ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. భారీ వాహనాలు పైవంతెన మీదకు వస్తుండటంతో ఎన్‌హెచ్ 65 జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించిపోతోంది. పైవంతెన ఆరు లైన్లుగా ఉండటం ఎన్‌హెచ్ 65 నాలుగు లైన్లుగా ఉండటంతో భవానీపురం వైపు వాహనాలు బారులు తీరి ఉంటున్నాయి.
ఆ సమయంలోనే అనుమతి..
ఇప్పటికే భవానీపురం స్వాతి సెంటర్ కూడలిని ట్రాఫిక్ పోలీసులు మూసివేశారు. ఉదయం 6 నుంచి 10.30 గంటల మధ్య లారీలు , టిప్పర్లు , ట్రక్కులు, కంటైనర్లు, ఇతర రవాణా వాహనాలు వెళ్లేందుకు వీలు లేదని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. రాత్రి 10.30 నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రం వెళ్లేందుకు అనుమతి ఉందని పోలీసులు పేర్కొంటున్నారు. పగటి పూట ఇబ్రహీంపట్నం రింగు రోడ్డు నుంచి జి.కొండూరు మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
ఇన్నర్ రింగు రోడ్డు మీదనే..
ఎన్‌హెచ్ -16 వైపు నుంచి వచ్చే వాహనాలు యధావిధిగా ఇన్నర్ రింగు రోడ్డు మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. కనకదుర్గ పైవంతెన ప్రారంభమైన తర్వాత ఎన్‌హెచ్ 65 పై భవానీపురం వైపు నుంచి భారీ ఎత్తున లారీలు, టిప్పర్లు వస్తున్నాయి. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం నుంచి జగ్గయ్యపేట వరకు క్రషర్లు, ఇసుక ర్యాంపులు, సిమెంట్ కంపెనీలు ఉండటంతో లోడు లారీలు పెద్ద సంఖ్యలో పైవంతెన మీదుగా నగరంలోకి వస్తున్నాయి. ఫలితంగా ట్రాఫిక్ స్తంభిస్తోంది.
భారీ వాహనాలు వేగంగా..
భారీ వాహనాలు వేగంగా వెళ్తుండటంతో ప్రమాదాలు సంభవించేందుకు ఆస్కారం ఉందని పోలీసులు భావించారు. ఈ నేపథ్యంలో భవానీపురం వైపు ఎన్‌హెచ్ -65 నాలుగు లైన్లుగా ఉండటంతో మరింత సమస్యగా మారటంతో పగటి పూట పైవంతెనపైకి అనుమతించట్లేదని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : 'మంత్రిగా ఏం చేయాలో తెలియక కాలక్షేపం చేస్తున్నారు'