రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని నియోజకవర్గంలోనే రేషన్ దుకాణదారులు దసరా మామూళ్లు ఇవ్వాలంటూ చాటింపు వేయించడం అందర్నీ విస్తుగొల్పుతోంది. దసరా సందర్భంగా కార్డుదారులందరూ రేషన్ బియ్యానికి వచ్చేటప్పుడు రూ.20 చొప్పున దసరా మామూళ్లు ఇవ్వాలంటూ చాటింపు వేయడం రెవెన్యూ వర్గాల్లో చర్చకు దారి తీసింది.
కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామం దీనికి కేంద్రబిందువుగా మారింది. పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సొంత నియోజకవర్గంలో ఈ ఘటన జరగటంతో మరింత చర్చనీయాంశమైంది. కార్డుదారులందరూ రూ. 20 వంతున దసరా మామూళ్లు తెచ్చి ఇవ్వాలంటూ టముకు వేయాల్సిందిగా గ్రామంలోని ముగ్గురు డీలర్లు కలిసి ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై టాంటాం వేసే ప్రభాకరరావుతో చెప్పారు. దీంతో అతడు శనివారం ఉదయం గ్రామంలోని ప్రతి వీధిలో తిరిగి ఆ మేరకు చాటింపు వేశాడు. అది విన్న గ్రామస్థులు, కార్డుదారులు విస్తుపోతున్నారు. బహిరంగంగా దసరా మామూళ్లు తీసుకురావాలనడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. టముకు వేసిన ప్రభాకరరావును వివరణ కోరగా డీలర్లు చెప్పడంతో చాటింపు వేశానని చెప్పారు. దీనిపై తహసీల్దార్ ఆంజనేయులని అడగగా... చాటింపు వేయించినట్లు తమ పరిశీలనలో తేలిందని.. వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇదీ చూడండి. వరద ధాటికి కుప్పకూలిన పురాతన వంతెన