దసరా శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా మూడో రోజు అమ్మవారు గాయత్రీదేవి రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనుంది. సకల మంత్రాలకూ మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధిపొంది ముక్తా, విద్రుమ, హేమ, నీల, దవళ వర్ణాలతో ప్రకాశించే పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీదేవి. ఈ తల్లి శిరస్సుపై బ్రహ్మ, హృదయములో విష్ణువు, శిఖలో రుద్రుడు నివసిస్తుండగా.. త్రిమూర్త్యాంశగా గాయత్రీదేవి వెలుగొందుతుంది. సమస్త దేవతా మంత్రాలకూ గాయత్రీ మంత్రంతో అనుబంధం ఉంది. గాయత్రీ మంత్రంతో సంప్రోక్షణ చేసిన తరువాతే ఆయా దేవతలకు అన్నాదులు, ప్రసాదాలు నివేదన చేస్తారు. గాయత్రీ అమ్మవారిని దర్శించుకోవడం వల్ల ఆరోగ్యం, సకల మంత్రసిద్ధి, తేజస్సు, జ్ఞానం పొందుతారు. దర్శనం ఉదయం 4గంటల నుంచి రాత్రి 10గంటల వరకు ఉంటుంది.
సమేత దుర్గామల్లేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులు
దుర్గగుడి దసరా ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పర్యవేక్షించారు. భక్తుల సేవా టిక్కెట్లు, ప్రసాద విక్రయాల ద్వారా రూ.17.70లక్షల ఆదాయం రెండో రోజు సమకూరినట్టు ఆలయ ఈవో డి.భ్రమరాంబ వెల్లడించారు. ఉదయం నుంచే భక్తులు తరలిరావడంతో ఇంద్రకీలాద్రి పరిసరాలు కిక్కిరిసిపోయాయి. బాలాత్రిపుర సుందరీదేవి రూపాన్ని కుమారీలుగా పిలిచే బాలికల ప్రతిరూపంగా భావిస్తారని ఈవో అన్నారు. అందుకే ఆలయం తరఫున బాలికలకు శుక్రవారం సువాసిని పూజలు నిర్వహించినట్టు వెల్లడించారు.
ఇదీ చూడండి: HAMSA VAHANA SEVA : తిరుమలలో వైభవంగా హంస వాహన సేవ