కృష్ణా జిల్లా ఘంటశాల గ్రామంలోని శ్రీ బాలపార్వతీ సమేత జలధీశ్వర స్వామి ఆలయం...అతి ప్రాచీన క్షేత్రంగా పేరొందింది. భువిలో మరెక్కడా లేని విధంగా ఈ ఆలయంలో ఏకపీఠంపై శివపార్వతులు దర్శనమిస్తారు. అంతేకాక గంగాదేవిని ఇముడ్చుకుని జలధీశ్వర నామంలో స్వామివారు విరాజిల్లుతున్నారు.
ఆగస్త్య చేసిన అద్భుతం
పరమేశ్వరుడి ఆజ్ఞ మేరకు అగస్త్య మహర్షి ఘంటశాలలో శివపార్వతుల విగ్రహ ప్రతిష్ట జరిపారని స్థల పురాణం చెబుతోంది. ఆనాటి నుంచి "దక్షిణ కైలాసం"గా ఈ క్షేత్రం ప్రశస్తి పొందింది. మూల విరాట్ సందర్శన సకల శుభాలను, సుఖాలను, సంపదలను, కీర్తి ప్రతిష్ఠలను కలిగిస్తుందని నమ్మకం. మాఘ పూర్ణిమనాడు జరిగే శివ పార్వతుల కళ్యాణాన్ని సమస్త దేవతలు ఈ క్షేత్రంలో వీక్షిస్తారని ప్రతీతి.
క్రీ.పూ నిర్మాణం
చాళుక్యులు, శాతవాహనులు వంటి రాజులు ఈ శైవ క్షేత్రాన్ని అభివృద్ధి చేసినట్లు చరిత్ర చెబుతుంది. ఈ శైవ క్షేత్రంలో లభించిన కొన్ని విగ్రహాలు క్రీస్తు పూర్వం 6000 సంవత్సరాల నాటి హరప్పా, మొహంజోదారో శిల్పకళలకు చెందినవిగా చరిత్ర పరిశోధకులు గుర్తించారు. ఇవి ఇప్పటికీ ఘంటసాల మ్యూజియంలో ఉన్నాయి.
దంపతులు సుఖంగా ఉండేందుకు
శ్రీ బాలపార్వతీ సమేత జలధీశ్వర స్వామి క్షేత్రం ఆవరణలో నవగ్రహ మండపం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. నూతన దంపతులు ఈ ఆలయంలో ఆదిదంపతులను దర్శిస్తే సంసార జీవితం సుఖ సంతోషాలతో ఉంటుందని భక్తుల నమ్మకం. మాస శివరాత్రి నాడు స్వామి వారి కళ్యాణం జరుపుతారు. ఈ విశిష్ఠ ఆలయం విజయవాడకు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది.