ap special status issue: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరపైకి వచ్చినట్లే వచ్చి మళ్లీ వెనక్కి వెళ్లిపోయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య విభజన సమస్యల పరిష్కారానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏర్పాటుచేసిన ఉపకమిటీ ఎజెండాలో తొలుత హోదా అంశాన్నీ చేర్చారు. ఈ నెల 17న కమిటీ తొలిసారి సమావేశం కానుంది. శనివారం ఉదయం ఎజెండాలోనూ ప్రత్యేక హోదా ఉంది. కానీ, శనివారం సాయంత్రం హఠాత్తుగా కమిటీ ఎజెండాను సవరించిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ... అందులో హోదాను తొలగించింది. ఆరేడు గంటల్లోనే ఎజెండా మారిపోయింది. ప్రత్యేక హోదాతో పాటు.. ఉత్తరాంధ్రలోని 3, రాయలసీమలోని 4 కలిపి మొత్తం 7 వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి గ్రాంటు అంశాన్ని తొలుత ఎజెండాలో ఉంచినా.. సవరణలో దాన్నీ తొలగించారు. పన్నుల రాయితీలు, వనరుల అంతరం అంశాలనూ సవరించిన ఎజెండాలో తొలగించారు. మొత్తమ్మీద మొదట 9 అంశాలను ఎజెండాలో పెట్టిన ఆ శాఖ.. సవరణలో అయిదింటినే ఉంచింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి ఆశిష్‌కుమార్, తెలంగాణ నుంచి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఏపీ నుంచి ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్ సభ్యులుగా ఏర్పాటైన ఈ కమిటీ ప్రతీనెలా సమావేశమవుతుందని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఈ నెల 17న నిర్వహించనున్న కమిటీ తొలి భేటీకి ఇరు రాష్ట్రాల ప్రతినిధులు హాజరవ్వాలని కోరుతూ రెండు రాష్ట్రాల సీఎస్‌లకు వర్తమానం పంపింది.
కమిటీ ఏర్పాటు ఇలా..
జనవరి 12న ఇరు రాష్ట్రాల సీఎస్‌లతో కేంద్ర హోం కార్యదర్శి నిర్వహించిన సమావేశంలో ఈ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం 2014తో పాటు ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తే ద్వైపాక్షిక అంశాల పరిష్కారానికి ఆచరణాత్మక మార్గాన్ని సిఫార్సు చేసేందుకు ఈ కమిటీని నియమించారు. అవసరాన్ని బట్టి వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల సంయుక్త కార్యదర్శులను సభ్య, ఆహ్వానితులుగా కమిటీ ఆహ్వానించవచ్చు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకం మేరకు కమిటీ ఏ వ్యక్తినైనా కో-ఆప్ట్ చేసుకోవచ్చు.
తొలుత కమిటీ ఎజెండా అంశాలు
* ఏపీ ఆర్థిక సంస్థ విభజన
* ఏపీ, తెలంగాణ విద్యుత్ వినియోగం పరిష్కారం
* పన్నులకు సంబంధించిన వాటిలో వ్యత్యాసాలను తొలగించడం
* బ్యాంకుల్లో నగదు నిల్వ, డిపాజిట్ల విభజన
* ఉభయ రాష్ట్రాల పౌరసరఫరాల సంస్థల మధ్య క్యాష్ క్రెడిట్
* వనరుల అంతరం
* ఉత్తరాంధ్ర, రాయలసీమలోని ఏడు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి గ్రాంటు
* ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా
* పన్ను రాయితీలు
సవరించిన ఎజెండా..
* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంస్థ విభజన
* ఏపీ జెన్‌కోకి టీఎస్ డిస్కంల విద్యుత్ వినియోగ చెల్లింపుల బకాయిలు
* పన్నుల విషయంలో తలెత్తిన వివిధ అంశాలు
* బ్యాంకుల్లోని నగదు, డిపాజిట్ల విభజన
* ఉభయ రాష్ట్రాల పౌరసరఫరాల సంస్థల మధ్య క్యాష్ క్రెడిట్ అంశం.
ఆర్థిక వివాదాల పరిష్కారానికే చర్చ పరిమితం
ప్రత్యేక హోదా, రెవెన్యూలోటు భర్తీపై ఉండదు
ఎంపీ జీవీఎల్ స్పష్టీకరణ
ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య ఉన్న విభజన సమస్యల పరిష్కారానికి రెండురాష్ట్రాల ప్రతినిధులతో ఈ నెల 17న కేంద్రహోంశాఖ ఆధ్వర్యంలోని వివాద పరిష్కార సబ్‌కమిటీ నిర్వహించే సమావేశంలో ప్రత్యేక హోదా, రెవెన్యూలోటు భర్తీపై ఎలాంటి చర్చా ఉండబోదని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. అది కేవలం రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఆర్థిక వివాదాల పరిష్కారానికే తప్ప ఏపీ ప్రత్యేక హోదా, రెవెన్యూలోటుపై చర్చించడానికి కాదన్నారు. ఆయన ఈ మేరకు మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘కేంద్ర హోంశాఖ ఉపకమిటీ విభజన సమస్యలపై ఈ నెల 17న రెండు రాష్ట్రాల ప్రతినిధులతో చర్చించనున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఎజెండాలో ప్రత్యేక హోదా, రెవెన్యూలోటు భర్తీ అంశంపైనా చర్చ ఉంటుందని వార్తలు రావడంతో దానిపై స్పష్టత కోసం నేను కేంద్రంలో అత్యంత సీనియర్ అధికారులతో మాట్లాడాను. ప్రత్యేక హోదా కేవలం ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే సంబంధించింది. రెవెన్యూ లోటు భర్తీ కూడా అంతే. ఎజెండాలో ఈ అంశాలు ఎలా వచ్చాయన్నది వాకబు చేసినప్పుడు ఈ కమిటీ రెండు రాష్ట్రాల మధ్య ఆర్థిక విభేదాల పరిష్కారానికే ఏర్పాటైందని, ఇందులో ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు భర్తీ అంశాల చర్చకు ఆస్కారం లేదని తెలిసింది. కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు అన్ని రకాల ఆర్థికసాయం అందాలన్నది మా ఆకాంక్ష. ప్రధానమంత్రి పార్లమెంటులో విభజన తీరు, ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని ప్రస్తావించారు. అన్ని రకాల అవకాశాలు, రాయితీలు రాష్ట్రానికి దక్కాలన్నది మా కోరిక. అయితే ప్రస్తుతం ప్రత్యేక హోదాపై మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రజలను అనవసరంగా తప్పుదోవ పట్టిస్తుంది కాబట్టి నేను ఈ వివరణ ఇస్తున్నా’ అని జీవీఎల్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే.. తెలంగాణతో చర్చించాలా?: జీవీఎల్