Compulsory retirement of police constable: పోలీసు దళంలో, ముఖ్యంగా ఏపీఎస్‌పీలో పనిచేసే వారు మంచి గుణగణాలు కలిగి ఉండాలని, హుందాతనంగా వ్యవహరించాలని, విలువపెరిగేలా ప్రవర్తించాలని హైకోర్టు పేర్కొంది. క్రమశిక్షణారాహిత్యం నవ్వులపాలు చేస్తుందని తెలిపింది. తద్వారా పోలీసు దళం ప్రతిష్ఠను దెబ్బతీసినట్లువుతందని పేర్కొంది.
అధికారుల నిర్ణయాన్ని సమర్థిస్తూ.. ముందస్తు సమాచారం లేకుండా తరచూ గైర్హాజరవుతూ, విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న ఓ పోలీసు కానిస్టేబుల్‌ను తప్పనిసరి పదవీ విరమణ చేయిస్తూ ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు సమర్థించింది. ఆ పోలీసు ఏడేళ్ల సర్వీసులో ఎనిమిది శిక్షలకు గురయ్యారని గుర్తుచేస్తూ.. క్రమశిక్షణకు మారుపేరైన పోలీసు దళంలో ఇలాంటి వ్యక్తి కొనసాగలేరని తెలిపింది. పలుమార్లు ఉన్నతాధికారులు వివిధ రూపాల్లో శిక్షలు విధించినా ఉద్దేశపూర్వకంగా అలవాటుగా విధులకు గైర్హాజరవుతున్నారని పేర్కొంది. వ్యక్తిత్వాన్ని చక్కదిద్దుకోలేదని ఆక్షేపించింది. విధులకు గైర్హాజరవుతూ తీవ్ర దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని తేల్చిచెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని పేర్కొంది. ఆ పోలీసు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఇటీవల ఈమేరకు తీర్పు ఇచ్చారు.
విధులకు గైర్హాజరు.. కాకినాడ ఏపీఎస్‌పీ పోలీసు కానిస్టేబుల్ వై.బాలకృష్ణ అధికారుల అనుమతి లేకుండా 2009 మే 23 నుంచి వరసగా 21 రోజులకు పైగా విధులకు వెళ్లలేదు. దీంతో ఉద్యోగం త్యజించిన వ్యక్తిగా అధికారులు ప్రకటించారు. విధులకు గైర్హాజరు, దుష్ప్రవర్తన, విధి నిర్వహణలో నిర్లక్ష్యం తదితర కారణాలతో ఉద్యోగం నుంచి తొలగించారు. ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ఇచ్చిన ఉత్తర్వులను తర్వాత సవరిస్తూ తప్పని సరి పదవీ విరమణగా 2011లో డీఐజీ ఉత్తర్వులిచ్చారు. ఆ ఉత్తర్వులపై పలు ప్రయత్నాలు చేసిన బాలకృష్ణకు ఉపశమనం లభించకపోవడంతో 2020లో హైకోర్టులో వ్యాజ్యం వేశారు.
పదేళ్లకు కోర్టును ఆశ్రయించి.. ఈ వ్యాజ్యంలో ఏపీఎస్‌పీ కమాండెంట్ కౌంటర్ దాఖలు చేస్తూ.. పదేళ్ల తర్వాత పిటిషనర్ కోర్టును ఆశ్రయించారన్నారు. దీనిని బట్టి ఆయనకు వృత్తిపట్ల నిబద్ధత ఏమిటో అర్థమవుతుందన్నారు. ఏడేళ్ల సర్వీసులో వివిధ రూపాల్లో ఎనిమిది శిక్షలకు కారకుడయ్యారన్నారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ఏడేళ్ల సర్వీసులో వివిధ రకాలుగా ఎనిమిది శిక్షలను చూస్తుంటే ప్రభుత్వ ఉద్యోగిగా పోలీసుశాఖలో పనిచేయడానికి పిటిషనర్ తగినవాడు కాదని స్పష్టం చేశారు. అనధికారికంగా గైర్హాజరవుతున్నందుకు విధులకు రావొద్దని నాలుగుసార్లు నిలువరించిన ట్రాక్ రికార్డు ఉందని గుర్తుచేశారు. ఇంక్రిమెంట్లు నిలుపుదల చేశారన్నారు. ఏపీఎస్‌పీలో పనిచేసే పోలీసులు మంచి గుణగణాలను కలిగి ఉండాలన్నారు. చెడ్డ ప్రవర్తన పోలీసు దళం ప్రతిష్ఠను దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. పోలీసు కానిస్టేబుల్ దాఖలు చేసిన వ్యాజ్యంలో జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పారు. వ్యాజ్యాన్ని కొట్టేస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు.
ఇవీ చదవండి :