బందరు పోర్టు ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేసిందని నవయుగ ఇంజనీరింగ్ సంస్థ హైకోర్టులో వాదనలు వినిపించింది. నోటీసులు పంపకుండా, వివరణ కోరకుండా ఒప్పందాన్ని రద్దు చేసిందని తెలిపింది. ఒప్పంద నిబంధనల మేరకు భూములని తమకు అప్పగించటంలో ప్రభుత్వం విఫలమైందని తెలిపింది. ఒప్పందాన్ని రద్దు చేస్తూ ఏపీ ఇంధన, మౌలిక సదుపాయాలు,పెట్టుబడుల శాఖ ముఖ్యకార్యదర్శి ఈ ఏడాది జారీచేసిన జీవో 66 అమలును నిలిపేయాలని నవయుగ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. "ఒప్పందం ప్రకారం ప్రభుత్వం 5324 ఎకరాలు మాకు కేటాయించాల్సి ఉండగా... 412 ఎకరాలను మాత్రమే అప్పగించింది. జిల్లా కలెక్టర్ రాసిన లేఖలో 932 ఎకరాలు ఆక్రమణలో ఉన్నాయని తెలిపారు. మావైపు నుంచి ఉల్లంఘన జరిగితే సరిదిద్దుకోవటానికి నోటీసు ఇవ్వాలి" సంస్థ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. పోర్టు ప్రాథమిక పనుల కోసం 436 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు. ఈ నేపథ్యంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వమని కోర్టును కోరింది.
ప్రభుత్వ తరపు ఏజీ వాదిస్తూ ప్రభుత్వం 2008 లోనే 412 ఎకరాలను సంస్థకు అప్పగించిందని తెలిపారు. క్షేత్రస్థాయిలో సైతం పనులు ప్రారంభం కాలేదన్నారు. దీనిలో రాజకీయ దురుద్దేశం లేదన్నారు. పిటిషనర్ సంస్థ ఖర్చు చేసిన సొమ్మును రాబట్టుకోవాలంటే ఆర్బిట్రేషన్ వెళ్లొచ్చని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంలో ప్రజాహితం ఉందని ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని న్యాయమూర్తిని కోరారు. ఇరువురి తరఫు వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వులో ఉంచింది