వేద విశ్వవిద్యాలయాలు వేదాలు, వేదాంగాలు వంటి సాంప్రదాయ జ్ఞానాన్ని అందిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాయని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మానవాళికి ప్రయోజనం చేకూర్చే ఆవిష్కరణలకు మన పురాతన గ్రంథాలు, సాంస్కృతిక వారసత్వం, జ్ఞానం ఆలంబనగా నిలుస్తున్న తరుణంలో భారతదేశం అత్యున్నత శక్తిగా పరిగణించ బడుతుందని బిశ్వభూషణ్ హరిచందన్ కొనియాడారు. తిరుపతి వేదికగా నిర్వహించిన శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఆరవ స్నాతకోత్సవంలో గవర్నర్ కీలకోపన్యాసం చేసారు. విజయవాడ రాజ్ భవన్ నుంచి వెబినార్ విధానంలో ప్రసంగించిన గవర్నర్.. భారతీయులు ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనకు ప్రాధన్యత ఇస్తూ వచ్చారని, ప్రాపంచిక వ్యవహారాల పట్ల ఆసక్తి చూపలేదని వివరించారు.
సామాజిక పరిస్థితులు, జ్ఞానం, బోధనల ఫలితంగా భారతదేశాన్ని ప్రపంచ వేదికపై విశ్వగురువుగా గౌరవిస్తున్నారని తెలిపారు. గొప్ప వారసత్వం, సహజ వనరులు, సైనిక బలం ఫలితంగా భారతదేశం ప్రపంచంలో సూపర్ పవర్‌గా ఆవిర్భవించిందన్నారు.
వేదాలు సమానత్వాన్ని బోధించాయి..
భారతీయ వేదాలు అంతర్జాతీయ సౌభ్రాతృత్వం, సమానత్వం, సంపద సమ పంపిణీని ప్రబోధించాయన్నారు. గతంలో భారతావని గణితం, జ్యోతిష్యం, వాణిజ్యం, ఆర్థిక శాస్త్రం, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో ముందంజలో ఉండేదని, అనేక శతాబ్దాల తర్వాత ఇప్పటికీ కౌశిక సూత్రం, వరాహమిహిరుని బృహత్ సంహిత , భరద్వాజ విమాన శాస్త్ర గ్రంథాలు మనకు గర్వకారణంగా నిలిచాయన్నారు. నాటి గ్రంథాలన్నీ శాస్త్రీయ సూత్రాలతో నిండి ఉన్నాయని, వీటి ద్వారా భారతీయులే కాక, విదేశీ శాస్త్రవేత్తలు సైతం ప్రేరణ పొందారని గవర్నర్ పేర్కొన్నారు.
వేదాల గొప్పదనాన్ని చెప్పే సమయం ఇదే..
సుసంపన్నమైన భారతీయ సాంస్కృతిక వారసత్వ సంపదకు సంరక్షకులుగా విశ్వవిద్యాలయాలు చేస్తున్న కృషి ఎంచదగినదన్నారు. ప్రత్యేకించి ప్రపంచ సంక్షేమానికి నాంది పలుకుతూ, మహిమాన్వితమైన భారతీయ సాహిత్యం, సంస్కృతిని ప్రతిష్ఠించే వేద విశ్వవిద్యాలయంలో ఉత్తీర్ణులైన వారంతా తమ బాధ్యతలు గుర్తెరిగి వ్యవహరించాలన్నారు. ప్రస్తుత పరిస్ధితులలో వేదాలు, సంబంధిత సాహిత్యం ఔచిత్యాన్ని నొక్కిచెప్పాల్సిన అవసరం ఉందన్న గవర్నర్ వైదిక విశ్వవిద్యాలయం ఈ రంగంలో సాధించిన అఖండమైన పురోగతి అధారంగా శాస్త్ర సాంకేతికతల ఆలంబనతో వినూత్న ఆవిష్కరణలకు మార్గం చూపవచ్చన్నారు.
అందుకే వేదాలు ఇంకా సజీవంగా ఉన్నాయి..
విజ్ఞానానికి సంబంధించిన "మౌఖిక ప్రసారం" భారతీయ సంప్రదాయం ప్రత్యేక లక్షణమని, ఇది భూమిపై మరెక్కడా కనిపించదని, వేద విశ్వవిద్యాలయం ఈ సంప్రదాయాన్ని కాపాడుతూ, మౌఖిక జ్ఞాన ప్రసార వ్యవస్థను పటిష్టం చేయటం అభినందనీయమన్నారు. ఈ పరిణామం ఫలితంగానే కొన్ని వేద గ్రంథాలు సజీవంగా ఉన్నాయన్నారు. వేద విజ్ఞాన ఫలాలు సామాన్యులకు అందించే బాధ్యతను వేద విశ్వవిద్యాలయం తీసుకోవాలని గవర్నర్ పిలుపు నిచ్చారు. విశ్వవిద్యాలయం సాంప్రదాయ గ్రంథాలతో పాటు గణితం వంటి వేద శాస్త్రాలను తన పాఠ్యాంశాల్లో చేర్చటం శుభపరిణామమని, పరిశోధకులు వారి డాక్టరేట్ డిగ్రీల కోసం వేద శాస్త్రాల అంశాలను ఎంచుకోవాలని సూచించారు. రాజ్ భవన్ నుంచి గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా కార్యక్రమంలో పాల్గొనగా, తిరుపతి నుంచి మహోపాధ్యాయ వి.గణేశన్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య సుదర్శన శర్మ, రిజిస్ట్రార్, డీన్లు, కార్యనిర్వాహక మండలి సభ్యులు, విద్యార్ధులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో మహాశివరాత్రి వేడుకలు