విద్యుత్‌కు తీవ్ర డిమాండ్ ఉంటుందని, అందుకు అనుగుణంగా బొగ్గు నిల్వలు పెంచుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని దాదాపు నెలా పదిహేను రోజుల కిందటే హెచ్చరించింది(power crisis in andhra pradesh news). బొగ్గు ఉత్పత్తి సంస్థలకు ఉన్న బకాయిలను ఏపీ జెన్‌కో తక్షణమే చెల్లించాలంటూ కేంద్ర ఇంధన శాఖ సెప్టెంబరు 2న రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌కు రాసిన లేఖలో ఈ మేరకు ప్రస్తావించింది. నిర్దేశిత వ్యవధిలో బొగ్గు ఉత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించి, బొగ్గు నిల్వలను పెంచుకోవాలని సూచించింది.
‘2021 జులై 31 నాటికి బొగ్గు ఉత్పత్తి సంస్థలకు ఏపీ జెన్‌కో(ap genco news) చెల్లించాల్సిన బకాయిలు రూ.215 కోట్లు ఉన్నాయి. వీటిపై కేంద్ర బొగ్గు శాఖ, కోల్ ఇండియా అనేకసార్లు ఏపీ జెన్‌కోను హెచ్చరించాయి’ అని కేంద్రం లేఖలో పేర్కొంది. ‘విద్యుత్ కొరత ఏర్పడే అవకాశం ఉందని కేంద్ర ఇంధన శాఖ సెప్టెంబరులోనే రాష్ట్రాన్ని అప్రమత్తం చేసింది. విద్యుత్ డిమాండ్‌లో అధిక శాతం థర్మల్ విద్యుత్ కేంద్రాలే తీరుస్తున్నాయని, దీన్ని దృష్టిలో ఉంచుకుని అవసరమైన మేరకు బొగ్గు నిల్వలు పెంచుకోవాలని సూచించింది. ప్రస్తుత అవసరాలను తీర్చేలా బొగ్గు ఉత్పత్తి లేదు. థర్మల్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు వేగంగా తరిగిపోతున్నాయి. ఈ పరిస్థితిని సమన్వయం చేయటానికి కేంద్రం కోర్ మేనేజ్‌మెంట్ టీమ్ (సీఎంటీ)ని ఏర్పాటు చేసింది. ఇందులో కేంద్ర ఇంధన శాఖ, రైల్వే, కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి, కోల్ ఇండియా, పోస్కోల నుంచి ఉండే సభ్యులు బొగ్గు నిల్వల పరిస్థితిని నిత్యం సమీక్షిస్తారు. కొన్ని థర్మల్ కేంద్రాల దగ్గర ఇప్పటికే తగిన బొగ్గు నిల్వలు లేవు’ అని కేంద్రం తాజాగా పేర్కొంది. ఈ ఏడాది ఆగస్టు 31న నిర్వహించిన సీఎంటీ సమావేశంలో రాష్ట్రానికి అవసరమైన బొగ్గును సరఫరా చేసేలా ఉత్పత్తి సంస్థలు సహకరించాలని అధికారులు కేంద్రాన్ని కోరారు.
రోజూ 20 రేక్‌లు కేటాయించండి: రాష్ట్రం
రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు రోజూ 20 రైల్వే రేక్‌ల బొగ్గును కేటాయించేలా బొగ్గు, రైల్వే శాఖలను ఆదేశించాలని తాజాగా కేంద్రాన్ని కోరినట్లు రాష్ట్ర ఇంధన శాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. పీపీఏలు, బొగ్గు అనుసంధానం లేకపోవటం నిలిచిపోయిన పిట్ హెడ్ థర్మల్ ప్లాంట్ల (బొగ్గు గనులకు దగ్గరగా ఉన్న ప్లాంట్లు)ను అత్యవసర ప్రాతిపదికన అనుమతులు ఇచ్చేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరింది. ‘దేశంలో విద్యుత్‌కు భారీ డిమాండ్ ఏర్పడటంతో నాలుగైదు రూపాయల ఉండే యూనిట్ ధర ప్రస్తుతం రూ.20కు చేరింది. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 160 నుంచి 190 మిలియన్ యూనిట్ల (ఎంయూ)కు చేరింది. బొగ్గు కొరతతో కడపలోని ఆర్‌టీపీపీలో కొన్ని యూనిట్లను మూసేయాల్సి వచ్చింది. కృష్ణపట్నం, వీటీపీఎస్‌ల సామర్థ్యం కంటే తక్కువ ఉత్పత్తి వస్తోంది. మొత్తంగా 5,010 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న జెన్‌కో ప్లాంట్ల నుంచి 2300- 2500 మెగావాట్లు మాత్రమే వస్తోంది. గత నెలలో జెన్‌కో ప్లాంట్లకు రోజుకు 70 వేల టన్నుల బొగ్గు కావాల్సి ఉంటే 24 వేల టన్నులే వచ్చింది. ప్రస్తుతం 40 వేల టన్నులకు చేరింది’ అని ప్రకటనలో పేర్కొంది.
ఆదుకున్న జల విద్యుత్
రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న విద్యుత్ సంక్షోభాన్ని కొంతమేర అధిగమించడంలో జల విద్యుత్ కీలకంగా మారింది. అది కూడా అందుబాటులో లేకుంటే విద్యుత్ సమస్య మరింత తీవ్రంగా ఉండేదని నిపుణులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ రోజూ 185.3 మిలియన్ యూనిట్లుగా(ఎంయూ) ఉంది. ఇందులో జెెన్‌కోకు జలవిద్యుత్ ప్రాజెక్టుల నుంచి రోజూ 25 ఎంయూల విద్యుత్ వస్తోంది. శ్రీశైలం కుడిగట్టు కాలువపై 770 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఏడు యూనిట్లను ఉత్పత్తిలో ఉంచారు. వాటి నుంచి రోజూ 15 ఎంయూలు, సీలేరు నుంచి 8 ఎంయూల విద్యుదుత్పత్తి అవుతోంది. నాగార్జున సాగర్, టేల్‌పాండ్, డొంకరాయి, మాచ్‌ఖండ్, తుంగభద్ర డ్యామ్.. ఇతర చిన్నచిన్న జల విద్యుత్ కేంద్రాల నుంచి రోజూ 2 ఎంయూల విద్యుత్ వస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ కొరతను దృష్టిలో ఉంచుకుని అన్ని జల విద్యుత్ ప్రాజెక్టులను ఉత్పత్తిలో ఉంచారు. మంగళవారం గ్రిడ్ పీక్ డిమాండ్ 9064 మెగావాట్లకు చేరింది. శ్రీశైలం జలాశయంలోకి ప్రస్తుతం 1.20 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రస్తుత నీటిమట్టంతో సుమారు 20-25 రోజుల వరకు విద్యుదుత్పత్తి కొనసాగించొచ్చని అధికారులు తెలిపారు.
బొగ్గు నిల్వలు పెంచుకునే ప్రయత్నం
బొగ్గు నిల్వలను పెంచుకోవటంపై జెన్‌కో తీవ్రంగా ప్రయత్నిస్తోంది. బుధవారానికి విజయవాడలోని వీటీపీఎస్ దగ్గర 21,177 టన్నులు, కడపలోని రాయలసీమ థర్మల్ ప్రాజెక్టు (ఆర్‌టీపీపీ) దగ్గర 69,813 టన్నులు, కృష్ణపట్నంలో 93,789 ఎంటీల నిల్వలు ఉన్నాయి. సింగరేణి, మహానది కోల్‌ఫీల్డ్స్ నుంచి వీటీపీఎస్‌కు 16 సుమారు 60 వేల టన్నులు, ఆర్‌టీపీపీకి 35 వేల టన్నుల బొగ్గు వస్తోంది. కృష్ణపట్నం ప్లాంటుకు 72 వేల టన్నుల బొగ్గు సముద్ర మార్గంలో వస్తోంది. మరో 70 వేల టన్నులను లోడింగ్‌కు ఉంచుతున్నారు.
ఇదీ చదవండి: Night curfew extended: రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు.. ఎప్పటి వరకు అంటే?