Tension Gudivada Police Station: మాజీ మంత్రి, వైకాపా ఎమ్మెల్యే కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలంటూ కృష్ణా జిల్లా గుడివాడలో తెదేపా చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడి కుటుంబాలు, తెలుగు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ నాయకులు, కార్యకర్తలు ఆదివారం ఆందోళన చేపట్టారు. కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు తెదేపా నాయకులు పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. పెనమలూరు, కైకలూరు మాజీ ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్, జయమంగళ వెంకటరమణ, పెడన నియోజకవర్గ తెదేపా బాధ్యుడు కాగిత వెంకట కృష్ణప్రసాద్, హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ, పలువురు నాయకులు హాజరయ్యారు. సమావేశానికి వెళ్లే సమయంలోనే పోలీసులు కొందరిని అడ్డుకున్నారు. కొంతదూరం బస్సులో, ఆ తరువాత ద్విచక్ర వాహనాలపై ప్రయాణించి నాయకులు ఎట్టకేలకు కార్యాలయానికి చేరుకున్నారు. నానిపై తక్షణం చర్యలు తీసుకోవాలంటూ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు నిర్ణయించారు.
గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు తెదేపా నేతలతో కలిసి స్టేషన్‌వైపు బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేదని, తామే వచ్చి ఫిర్యాదు తీసుకుంటామని పేర్కొన్నారు. పార్టీ కార్యాలయం నుంచి నాయకులు బయటకు రాకుండా టెక్స్‌టైల్స్ రోడ్‌ను బారికేడ్లతో మూసేశారు. రహదారులపై తాడు కట్టారు. అయినప్పటికీ నాయకులు, వందలాది కార్యకర్తలు వాటిని తోసుకొని ముందుకు కదిలారు. కేసు పెట్టే హక్కును పోలీసులు ఎలా అడ్డుకుంటారని రావి వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. నాయకుల వాదనలు వినిపించుకోకుండా.. అడ్డుకోవడమే లక్ష్యంగా పోలీసులు వ్యవహరించడం ఉద్రిక్తతకు దారి తీసింది. నాయకులు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాటలు చోటుచేసుకున్నాయి. రావి వెంకటేశ్వరరావు దుస్తులు చిరిగిపోయాయి. పోలీసుస్టేషన్ వరకు ర్యాలీగానే వస్తామని నాయకులంతా పట్టుబట్టడంతో చేసేదిలేక పోలీసులు అనుమతిచ్చారు. నానికి వ్యతిరేకంగా నినదిస్తూ బయలుదేరారు. అప్పటికే వన్‌టౌన్ పోలీసుస్టేషన్ ప్రధాన గేటును మూసేశారు. ఆగ్రహించిన తెదేపా నాయకులు పోలీసుస్టేషన్‌కు రావడం తప్పా? అంటూ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో డీఎస్పీలు రాజీవ్‌కుమార్, విజయ్‌పాల్ తదితరులు నాయకులతో చర్చించి ఐదుగురిని లోనికి అనుమతించారు. చివరికి స్టేషన్ లోపలకు వెళ్లకుండానే నాయకులు తమ ఫిర్యాదును అందజేశారు.
నానికి రోజులు దగ్గరపడ్డాయి: తెదేపా
సమాజం తలదించుకునేలా మాట్లాడిన కొడాలి నానికి రోజులు దగ్గరపడ్డాయని తెదేపా నియోజకవర్గ బాధ్యుడు రావి వెంకటేశ్వరరావు ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్టీఆర్ తనకు దైవంతో సమానమంటూనే వారి కుటుంబం గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. తమ కార్యకర్తల సహనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దని తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి బోడే ప్రసాద్ హెచ్చరించారు. నేతలు జయమంగళ వెంకటరమణ, కాగిత కృష్ణప్రసాద్ తదితరులు కూడా కొడాలి నానిపై మండిపడ్డారు.
* తెదేపా పామర్రు కార్యాలయం నుంచి గుడివాడ బయలుదేరిన పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురాం, కొనకళ్ల నారాయణరావు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు తదితర ముఖ్య నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో పామర్రులో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసుల తీరును నిరసిస్తూ వారు రోడ్డుపై బైఠాయించారు. అనంతరం గూడూరు పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లిన నాయకులను వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.
* తెదేపా సత్తెనపల్లి నియోజకవర్గ నాయకుడు మన్నెం శివనాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో సత్తెనపల్లిలో ఎన్టీఆర్ భవన్ నుంచి పోలీసుస్టేషన్ వరకు ప్రదర్శనగా వెళ్లారు. కొడాలి నానిపై కేసు నమోదు కోసం పట్టణ సీఐ శోభన్‌బాబుకు విన్నపమిచ్చారు.
ఇవీ చదవండి: