కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నుంచి పులిచింతల ప్రాజెక్టు వద్దకు వెళ్తున్న ప్రభుత్వ విప్ సామినేని ఉదయభానుని సరిహద్దులో తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. ముక్త్యాల గ్రామ శివారులోనే తెలంగాణ పోలీసులు ఆయనను ఆపివేశారు. ఏపీ భూభాగం నుంచి వెళ్లాలని సూచించారు. వాస్తవాలు పరిశీలించేందుకు వెళ్తుంటే అడ్డుకోవాల్సిన అవసరం ఏంటని అధికారులను ఉదయభాను నిలదీశారు. నీటి వాటాలపై తెలంగాణ ప్రభుత్వం నిబంధనలు పాటించట్లేదని విమర్శించారు.
కృష్ణా డెల్టా అవసరాల కోసమే పులిచింతల నిర్మించారని.. ఏపీ రైతుల హక్కులను కాలరాస్తూ తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తోందన్నారు. తెలంగాణ మంత్రులు మాట్లాడుతున్న తీరు బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ నీటి తరలింపులను చూస్తూ ఉరుకోబోమని ఉదయభాను స్పష్టం చేశారు. అనంతరం జగ్గయ్యపేట మండలం ముక్త్యాల వద్ద కృష్ణా నది దాటి పులిచింతల వెళ్లారు. పడవ ద్వారా అచ్చంపేట మండలం మాదిపాడు చేరుకున్న ఉదయభాను పులిచింతల ప్రాజెక్టు వద్దకు వెళ్లారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ఇదీ చూడండి:
TDP MLA's Letter To CM: 'రాయలసీమ ఎత్తిపోతల వల్ల ప్రకాశం జిల్లాకు తీవ్ర నష్టం'