వెబ్ కౌన్సెలింగ్ పేరుతో ఉపాధ్యాయ బదిలీల్లో ప్రభుత్వం రాజకీయాలకు పాల్పడుతోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. సీనియారిటీని కాదని తన వర్గం కోసం నీచమైన చర్యలకు దిగుతోందని మండిపడ్డారు. సమాజానికి ఆదర్శంగా నిలిచిన ఉపాధ్యాయులు రోడ్డెక్కి నిరసన తెలిపేలా జగన్ ప్రభుత్వం చేసిందని దుయ్యబట్టారు. సర్వత్రా వ్యతిరేకిస్తున్న వెబ్ కౌన్సెలింగ్కు ప్రభుత్వం ముందుకెళ్లటం ఎవరి కోసమని నిలదీశారు.
బదిలీ ప్రాంతాలను బ్లాక్ చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన చేస్తున్న టీచర్లను అరెస్టు చేయటం సిగ్గుచేటని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టానుసారం వ్యవహరిస్తూ విద్యా రంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఆక్షేపించారు. డీఅర్సీ, పీఆర్సీ, ఐఆర్ లతో పాటు జీతాల చెల్లింపు సక్రమంగా చేయకుండా మోసగిస్తున్నారన్నారు. ప్రజాసంఘాలు, తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నా పాఠశాలలు తెరిచి వందలాది మంది టీచర్లు, విద్యార్థులు కరోనా బారిన పడేలా చేశారని దుయ్యబట్టారు. ప్రభుత్వ ఏకపక్ష విధానాలతోనే పదుల సంఖ్యలో ఉపాధ్యాయులు చనిపోయారని మండిపడ్డారు. తక్షణమే వెబ్ కౌన్సెలింగ్ రద్దు చేసి మాన్యువల్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి..