Bumper Offer For Diploma Candidates: సాంకేతిక విద్యలో నైపుణ్యాలు ఉంటే డిప్లొమా విద్యార్థులకు సైతం కంపెనీలు మంచి ప్యాకేజీలు ఇస్తున్నాయి. పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రతిభ చూపిన వారిని ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంటున్నాయి. పరిశ్రమల్లో మధ్యస్థాయిలో పనిచేసే డిప్లొమా అభ్యర్థులకు ప్రస్తుతం డిమాండ్ పెరుగుతోంది. కంపెనీలు అభ్యర్థుల నైపుణ్యంతో పాటు అకడమిక్‌కు సైతం ప్రాధాన్యం ఇస్తున్నాయి.
డిప్లొమా విద్యార్థులకు సువర్ణావకాశం: రాష్ట్రంలో పాలిటెక్నిక్ చేస్తున్న విద్యార్థులు వివిధ కారణాలతో దాదాపు 90 శాతం మంది బీటెక్‌కు వెళ్లిపోతున్నారు. మరోపక్క పరిశ్రమలకు డిప్లొమా అభ్యర్థుల అవసరాలు పెరుగుతున్నాయి. ఇంకోపక్క బీటెక్ చేసినా చాలామందికి మంచి జీతాలు అందుతున్న పరిస్థితులు ఉండడం లేదు. పాలిటెక్నిక్ చదివిన వారికి మంచి వేతనాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సాంకేతిక విద్యాశాఖ చర్యలు చేపట్టింది. శిక్షణ, ప్రాంగణ నియామకాల విభాగం డిప్యూటీ డైరెక్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో ప్రాంగణ నియామకాలు నిర్వహిస్తున్నారు. మేథ సర్వోడ్రైవ్స్ సంస్థ 89 మందిని ఇంటర్న్‌షిప్‌కు తీసుకుంది. వీరందరికీ ఏడాదికి రూ.2.9 లక్షల వేతన ప్యాకేజీ ఇస్తామని సమాచారం ఇచ్చింది.
టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్ కంపెనీ ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 15 మంది విద్యార్థులను ఏడాదికి రూ.9.02 లక్షల ప్యాకేజీకి ఎంపిక చేసుకుంది. వీరికి మొదట ఆరు నెలలు ఇంటర్న్‌షిప్ ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ విభాగాలకు చెందిన అభ్యర్థులకు ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్య్వూలు నిర్వహించి ఎంపిక చేసుకుంది. ఇప్పటి వరకు పాలిటెక్నిక్‌ల్లో నిర్వహించిన ప్రాంగణ నియామకాలకు వచ్చిన అత్యధిక ప్యాకేజీ ఇదే.
థాట్‌వర్క్స్ కంపెనీ రూ.8 లక్షల ప్యాకేజీతో ప్రాంగణ నియామకాల ప్రక్రియను చేపట్టింది. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ అభ్యర్థులను ఎంపిక చేయనుంది. రాత పరీక్షకు 1,470 మంది హాజరు కాగా ఈ నెల 10 నుంచి నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు 69 మంది ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా ఈ కంపెనీ వంద మందిని తీసుకోనుంది. ఎఫ్ట్రోనిక్స్ సిస్టమ్స్ కంపెనీ రూ.3.2 లక్షల ప్యాకేజీ ఇస్తోంది. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అభ్యర్థులు ఇప్పటికే 800 మంది నమోదు చేసుకున్నారు. ఈ ప్రక్రియ కొనసాగుతోంది.
జీఈ ఎయిరోస్పేస్ కంపెనీ మెకానికల్, ఆటోమొబైల్ విద్యార్థులకు ప్రాథమికంగా రూ.2 లక్షల ప్యాకేజీ, ఆ తర్వాత ఆన్ జాబ్‌లో రూ.2.54 లక్షలు ఇస్తోంది. ఈ సంస్థ నిర్వహించిన రాత పరీక్షలకు 234 మంది హాజరు కాగా ఇంటర్వ్యూలు చేయాల్సి ఉంది. వీల్స్ ఇండియా కంపెనీ ఎన్‌బీఏ అక్రిడేషన్‌కు ప్రాధాన్యం ఇస్తోంది. ఈ బ్రాంచిల్లో చదివిన వారికి రూ.2.43 లక్షల ప్యాకేజీ ఇస్తుండగా ఇతర బ్రాంచిల వారికి రూ.2 లక్షలు ఇస్తోంది. మెకానికల్, ఆటోమొబైల్, మెట్రాలజీ, కెమికల్ ఇంజినీరింగ్ వారిని ఎంపిక చేస్తోంది.హెచ్‌ఎల్ మ్యాన్‌డో రూ.2 లక్షల ప్యాకేజీ ఇవ్వడంతోపాటు వసతి, భోజనం సదుపాయం కల్పిస్తోంది. ఈ సంస్థతో సాంకేతిక విద్యాశాఖ సంప్రదింపులు జరుపుతోంది. విప్రో (సిమ్) కింద జాతీయస్థాయిలో నిర్వహించే ఎంపికలకు విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు.
బ్యాక్‌లాగ్ ఉంటే వద్దు: కంపెనీలు ప్రాంగణ ఎంపికల సమయంలో అభ్యర్థుల బ్యాక్‌లాగ్‌లను పరిశీలిస్తున్నాయి. ఏ ఒక్క సబ్జెక్టు ఉన్నా వారిని వద్దంటున్నాయి.అకడమిక్ మార్కులకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. కొన్ని 50% మరికొన్ని 60% ఇంకొన్ని 70% మార్కులున్న వారికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. భావవ్యక్తీకరణ నైపుణ్యాలు, ఆప్టిట్యూడ్, రీజనింగ్, టెక్నికల్ సబ్జెక్టుల్లో విద్యార్థుల ప్రతిభను పరిశీలిస్తున్నాయి. సాఫ్ట్‌వేర్ వైపు తీసుకునేవి కోడింగ్‌ను పరీక్షిస్తున్నాయి.
జీతం లక్షల్లో, జీవితం లగ్జరీగా! - మీరు కూడా అవుతారా పైలట్? - How to Become a Pilot