పురపాకల ఎన్నికల తెదేపా మేనిఫెస్టోను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అమరావతి ఎన్టీఆర్ భవన్‌లో విడుదల చేశారు. 'పల్లెలు గెలిచాయి..ఇప్పుడిక మనవంతు' పేరుతో 10 అంశాలతో ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు. ప్రశాంతంగా ఉన్న విశాఖలో భూకబ్జాలు, బెదిరింపులు పెరిగాయని లోకేశ్ మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచేశారని అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాక బస్సు ఛార్జీలు పెంచారని మండిపడ్డారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో పబ్లిసిటీ పీక్, మ్యాటర్ వీక్ గా ఉందని లోకేశ్ ధ్వజమెత్తారు. గత 20 నెలల్లో ప్రజలకు చేసింది శూన్యమని దుయ్యబట్టారు. శాంతి భద్రతలు అదుపు తప్పటంతో బులెట్ లేని గన్గా జగన్ మిగిలారని ఎద్దేవా చేశారు. గతంలో 200 రూపాయలు వచ్చే విద్యుత్ బిల్లులు ఇప్పుడు వెయ్యి రూపాయలకు పైగా వస్తున్నాయని...మండిపడ్డారు. దీంతో పాటు ఇతర నిత్యావసరాల ధరలను భారీగా పెంచారని విమర్శించారు.
ప్రజలపై మోయలేని పన్నుల భారం మోపారని ఆరోపించారు. పట్టణ ప్రజల్ని ఇబ్బంది పెట్టేలా ప్రభుత్వ చర్యలున్నాయని మండిపడ్డారు. అన్నా కాంటీన్లు తెరిచి 5 రూపాయలకే భోజనం పెడతామన్నారు. పాత పన్ను మాఫీ చేసి ఇకపై సగం పన్నే వసూలు చేస్తామని మేనిఫెస్టోలు పేర్కొన్నారు. శుభ్రమైన ఊరు శుద్ధమైన నీరు అమలు చేస్తామన్నారు. నిరుద్యోగ యువతకు ప్రతి 6నెలలకోసారి ఉద్యోగమేళా నిర్వహిస్తామని చెప్పారు. సుందరీకరణ మిషన్, చెత్త లేని నగరం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆటో డ్రైవర్ల కు అన్ని సదుపాయాలతో ఆటో స్టాండ్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. మెప్మాలు బలోపేతంతో పాటు పట్టణ పేదలకు టిడ్కో ఇళ్లు పంపిణీ చేపడతామని వివరించారు. పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు 21 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు.
పది అంశాలు..
- అన్నక్యాంటీన్లు.. 5 రూలకే భోజనం..
- పాత పన్ను మాఫీ ... ఇకపై సగం పన్నే వసూలు
- శుభ్రమైన ఊరు.. శుద్ధమైన నీరు
- నిరుద్యోగులకు 6 నెలలకొకసారి జాబ్ మేళా
- సుందరీకరణ మిషన్, చెత్త లేని నగరం ఏర్పాటు
- ఆటో డ్రైవర్లకు తాగునీరు, ఆటోస్టాండులు
- మెప్మా బజార్, మెప్మాలు బలోపేతం, సున్నా వడ్డీకి బ్యాంకు లింకేజీ
- పారిశుద్ధ్య కార్మికులకు 21 వేల వేతనం
- పట్టణ , పేదలకు గృహనిర్మాణం.
- ఉచిత మంచినీటి కనెక్షన్..
ఇదీ చూడండి. ' శంకర్ విలాస్ వంతెనను పొడగించండి'