OBC Reservation : తూర్పు కాపులకు రాష్ట్రమంతా బీసీ రిజర్వేషన్ అమలు చేస్తున్నప్పుడు, కేంద్ర ఓబీసీ రిజర్వేషన్లు మాత్రం ఉత్తరాంధ్రకే పరిమితం చేయటం తగదని టీడీపీ శాసనసభా పక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు హితవు పలికారు. ఉత్తరాంధ్ర నుంచి వలస వెళ్లిన తూర్పు కాపులకు కేంద్ర ఓబీసీ రిజర్వేషన్ అమలు కాక విద్యా, ఉద్యోగ అవకాశాల్లో నష్టం జరుగుతోందని ఆయన ఆరోపించారు.
ఓబీసీ రిజర్వేషన్ అంశంపై సచివాలయం అగ్నిమాపక కేంద్రం వద్ద నిమ్మల రామానాయుడు నిరసన వ్యక్తం చేశారు. గంటపాటు నల్ల కండువా మెడలో వేసుకొని ఎండలో నిలబడి నిరసన తెలిపారు. 31 మంది వైఎస్సార్సీపీ ఎంపీలు ఉన్నా ఈ రిజర్వేషన్ల అంశాన్ని కేంద్రం దృష్టికి ఎందుకు తీసుకెళ్లడం లేదని ఆయన నిలదీశారు. తూర్పు కాపులకు సీఎం ఎందుకు న్యాయం చేయలేక పోతున్నారంటూ మండిపడ్డారు. 31 మంది ఎంపీలను కేసుల మాఫీ, హత్య కేసు నుంచి బయటపడటానికే వాడుకుంటున్నారు తప్ప.. రాష్ట్ర సమస్యల కోసం కాదని విమర్శించారు. ప్రజా సమస్యల గళం వినపడకుండా శాసనసభలో తన గొంతు నొక్కినందుకు శాసనసభ వెలుపల ప్రతిరోజూ ప్రజా సమస్యలపై నిరసన గళం వినిపిస్తానని నిమ్మల రామానాయుడు తెలిపారు.
వైఎస్సార్సీపీకీ రాష్ట్రం నుంచి 31మంది ఎంపీల బలం ఉంది. 25మంది లోక్ సభ, ఆరుగురు రాజ్యసభ సభ్యుల బలాన్ని ఈ రాష్ట్ర ప్రజలు అందించారు. అయినా, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో రాజీపడుతోంది. ఉత్తరాంధ్ర కాపులు ఓబీసీ సర్టిఫికెట్ అందక ఎన్నో అవకాశాలను కోల్పోతున్నారు. ఈ విషయంలో కేంద్రంతో మాట్లాడి జీవోను అమలు చేయించలేకపోవడానికి కారణాలేమిటో అర్థం కావడం లేదు. 31మంది ఎంపీల బలాన్ని కేసులు మాఫీ చేయించుకోవడం కోసం వాడుకుంటున్నారు తప్ప.. ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల కోసం మాత్రం పని చేయడం లేదు. వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తారనే భయంతో.. అసెంబ్లీ ఉన్నా సరే వదిలేసి రాత్రికి రాత్రి దిల్లీకి వెళ్లడం వెనుక అర్థం ఏమిటి..? ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా స్వార్థ ప్రయోజనాల కోసం తాకట్టు పెడుతున్నారు. ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని మరోసారి కోరుతున్నా.. ఈ రాష్ట్రంలో తూర్పు కాపులకు న్యాయం జరగాలి. రాష్ట్రం అంతటా కేంద్రం అమలు చేస్తున్న ఓబీసీ రిజర్వేషన్ అమలు చేయాలి. ఇదే విషయాన్ని శాసన సభలో చెప్పాలనుకున్నా.. నా గొంతు నొక్కడంతో శాసనసభ వెలుపల నా నిరసన తెలుపుతున్నాను. - నిమ్మల రామానాయుడు, టీడీపీ శాసనసభా పక్ష ఉపనేత
ఇవీ చదవండి :