పంచాయతీ ఏకగ్రీవం విషయంలో మనస్తాపానికి గురై లింగగూడెం మాజీ సర్పంచి, తెదేపా నాయకుడు మురుకుట్ల రామారావు ఆత్మహత్యాయత్నం చేసుకున్న నేపథ్యంలో కేసు నమోదు చేసినట్లు సీఐ చంద్రశేఖర్, ఎస్సై రామకృష్ణ తెలిపారు.
విజయవాడ కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రామారావు మాట్లాడలేని స్థితిలో ఉన్నందున ఆయన సోదరుడు వెంకటేశ్వరరావు నుంచి పెనమలూరు ఏఎస్సై శివ బ్రహ్మయ్య స్టేట్ మెంట్ నమోదు చేసినట్లు చెప్పారు. ఆత్మహత్యాయత్నానికి ముందు రామారావు లేఖ రాసినట్లు తెలిసినందున దానిని కుటుంబ సభ్యుల నుంచి సేకరించి విచారణ చేస్తామని చెప్పారు.
లింగగూడెం ఏకగ్రీవానికి కృషి: ఉదయభాను
రామారావు ఆత్మహత్యాయత్నానికి ప్రస్తుత ఎన్నికలకు సంబంధం లేదని విప్ ఉదయభాను అన్నారు. పెనుగంచిప్రోలులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో పరిషత్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. పస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. గ్రామంలో ఏకగ్రీవమా.. ఎన్నికలా అనేది నాకు తెలియదు. ఏది ఏమైనా ఏకగ్రీవానికి కృషి చేస్తాం. రామారావు ఆత్మహత్యయత్నం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్న అన్నారు.
తెదేపా నేతల పరామర్శ
విజయవాడ కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రామారావును తెదేపా నేతలు పరామర్శించారు. ఎంపీ కేశినేని శ్రీనివాస్, విజయవాడ పార్లమెంట్ తెదేపా అధ్యక్షుడు నెట్టెం రఘురాం, మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యలు.. రామారావు ఆరోగ్య స్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.