ఇసుక సమస్యపై ఇప్పటికే రెండుసార్లు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించిన తెలుగుదేశం ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేలా ఐక్య కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ నెల 14వ తేదీన విజయవాడ ధర్నా చౌక్‌లో చంద్రబాబు తలపెట్టిన దీక్షకు అన్ని పార్టీల మద్దతు కూడగడుతోంది. ఆ పార్టీ సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు, చినరాజప్ప, కాలవ శ్రీనివాసులతో కూడిన బృందం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ తదితరులతో ఫోన్ చేసి మాట్లాడారు. జనసేన ఇప్పటికే చంద్రబాబు దీక్షకు మద్దతు ప్రకటించింది. ఆపార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్‌తో అచ్చెన్నాయుడు ఫోన్‌లో మాట్లాడారు. మంగళవారం రోజున పవన్ కళ్యాణ్ విజయవాడ పర్యటన ఉన్నందున... ఆయనతో మాట్లాడి చెప్తానని మనోహర్ సమాధానం ఇచ్చినట్లు తెలిసింది.
ప్రజలకు చంద్రబాబు లేఖ
చంద్రబాబు కూడా ప్రజలకు బహిరంగ లేఖ ద్వారా అందరి సహకారం కోరారు. ఇసుక కొరతతో నష్టపోయిన కార్మికులు, వ్యాపారాలు కోల్పొయిన వారు దీక్షలో భాగస్వాములు కావాలని లేఖ ద్వారా పిలుపునిచ్చారు. రాష్ట్రంలో లక్షల మంది రోడ్డున పడిన సమస్య కావడం వల్ల... అన్ని వర్గాలు దీక్షకు మద్దతు ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని బాబు పేర్కొన్నారు.
దీక్ష ఏర్పాట్లపై అధినేత చంద్రబాబు పార్టీ కార్యాలయంలో ముఖ్యనేతలతో చర్చించారు. కావాలి ఉచిత ఇసుక- పోవాలి ఇసుక మాఫియా అందరి నినాదం కావాలని దిశానిర్దేశం చేశారు. ‘‘ఇసుక కృత్రిమ కొరత-ప్రభుత్వ హత్యలకు’’నిరసనగా చేపట్టే 12గంటల దీక్ష... లక్షలాది భవన నిర్మాణ కార్మికులకు భరోసాగా ఉండాలని ఆకాంక్షించారు. తాపీ మేస్త్రీలు, తాపీ కార్మికులు, కార్పెంటర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు... నిర్మాణ రంగంలోని వివిధ వృత్తుల వారిని దీక్షలో భాగస్వామ్యుల్ని చేయాలని సూచించారు.
ఇవీ చదవండి
'12 గంటల ఇసుక దీక్షకు తరలిరావాలి'