TDP leaders fire on YSRCP Govt : ప్రజల్లో తిరుగుబాటును జగన్ రెడ్డి ఇంకా గుర్తించలేకపోతున్నాడని ఉమ్మడి కృష్ణ జిల్లా తెలుగుదేశం నేతలు ధ్వజమెత్తారు. 151సీట్లు వచ్చాయని విర్రవీగి తన పాలనకు తానే శుభం కార్డు వేసుకుంటున్నాడని దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీని రూపుమాపాలనే ధ్యేయంతో జగన్ రెడ్డి తనకు తానే పతనమయ్యాడని ఆరోపించారు. బ్రిటీషర్లకంటే ఘోరంగా జగన్మోహన్ రెడ్డి పాలన ఉందని మండిపడ్డారు. పట్టాభి కుటుంబ సభ్యులను తెలుగుదేశం నేతలు పరామర్శించారు. పట్టాభి నివాసానికి వెళ్లిన దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, గద్దె రామ్మోహన్, కేశినేని చిన్ని, బుద్దా వెంకన్న తదితరులు పట్టాభి భార్య చందనకు ధైర్యం చెప్పారు.
రెండురోజులుగా గన్నవరంలో జరిగిన ఘటనలు, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిస్థితి, రూల్ ఆఫ్ లా, అరాచక శక్తుల స్వైర విహారాన్ని మీడియా ద్వారా ప్రజానీకం గమనించింది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు చంద్రబాబు, లోకేశ్ బాబుపై ఎమ్మెల్యే వంశీ వ్యాఖ్యలను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చిన్నా ఖండించారు. దానిపై ఆయన ఇంటిపై దాడి చేయడంతో పాటు ఆయన భార్యపై దుర్భాషలాడారు. ఆయా సంఘటనలపై స్టేషన్ కు వెళ్తే పట్టాభిని పోలీసులు వివిధ వాహనాలు తిప్పుతూ చిత్రహింసలకు గురిచేయడాన్ని గమనిస్తే.. రక్షక భటులా.. భక్షక భటులా..? అని ప్రశ్నిస్తున్నాం. - దేవినేని ఉమామహేశ్వరరావు, టీడీపీ నేత
ప్రజాస్వామ్యం అర్థాలు మారిపోతున్నాయి. ప్రజలు తమ కష్టాన్ని చెప్పుకునేందుకు ఏర్పాటు చేసిన పోలీసులు నమ్మకం కోల్పోయారు. పార్టీని అణచి వేయడం, దాడులు చేయడంలో సహకరిస్తున్నారు. రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా మారిపోయింది. పార్టీ కార్యాలయంపై దాడి అంశాన్ని పోలీసులు పట్టించుకోలేదు. - గద్దె రామ్మోహన్, కేశినేని చిన్ని
గన్నవరం దాడులు.. జగన్ రెడ్డి దుర్మార్గ పాలనకు పరాకాష్ట అని చెప్పుకోవచ్చు. బీసీల అణచివేతకు పాల్పడుతున్నారు. ఇళ్లపైకి వెళ్లి దాడి చేయడం ఎంత వరకు సమంజసం. జగన్ రెడ్డి పాలన బ్రిటిషర్లను మించిపోయింది. దాడులు చేయడమే గాకుండా ఎదురు కేసులు పెట్టడం సరికాదు. పోలీసులు ఆత్మగౌరవాన్ని చంపుకొని పనిచేస్తున్నారు. - కొల్లు రవీంద్ర, బుద్దా వెంకన్న
పోలీసు వ్యవస్థను వైసీపీలో విలీనం చేసారా..: రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను వైసీపీ పార్టీలో విలీనం చేశారా.. అనే అనుమానం కలుగుతోందని ఎంపీ కొనకళ్ల నారాయణరావు అన్నారు. అవనిగడ్డ టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కొనకళ్ల మాట్లాడుతూ రాష్ట్రంలో విధ్వంసకర, అరాచక పాలన కొనసాగుతోందన్నారు. రెండు రోజుల క్రితం గన్నవరంలో పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన వారిని వదిలేసి, దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లిన తెలుగుదేశం పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయించి, జైలుకు పంపారని మండిపడ్డారు.
పోలీసులు సమాధానం చెప్పాలి...: దాడికి పాల్పడిన వారిని ఇంతవరకూ ఎందుకు అరెస్ట్ చేయలేదని, అసలు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిందా.. లేదా..? అనేది పోలీసులు సమాధానం చెప్పాలని అన్నారు. నేరానికి పాల్పడిన, దౌర్జన్యం చేసిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో పోలీసులు చెప్పాలని అన్నారు. దాడి చేసిన వారిపై కేసు పెట్టి అరెస్ట్ చేయకపోగా, ప్రజాస్వామ్యాన్ని మంటగలిపి, నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. తన రాజకీయ జీవితంలో ఇటువంటి దుర్మార్గమైన పరిస్థితులు ఇంతవరకు చూడలేదని, ఎక్కడో రాయలసీమ, పల్నాడులో జరిగిన విధ్వంసం కృష్ణా జిల్లాకు వస్తుందని అనుకోలేదన్నారు. దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకుని ఉద్రిక్త పరిస్థితులను చక్కదిద్దకుండా బాధితులను అదుపులోకి తీసుకోవడమేమిటని ప్రశ్నించారు. అభ్యంతర వ్యాఖ్యలను చేసినందుకు తెలుగుదేశం నేత పట్టాభిపై కేసులు పెట్టామని అంటున్నారు కానీ, రాష్ట్రంలో వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ కంటే అభ్యంతరకర వ్యాఖ్యలు చేసేవారు ఎవరైనా ఉన్నారా..? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో ఓటు రూపంలో బుద్ధి చెప్తారని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి :