TDP LEADER ATCHANNAIDU FIRES ON CM JAGAN : ఆక్వా రైతులను ఆదుకోవాల్సిన జగన్ రెడ్డి.. ప్రశ్నించిన తెదేపా నేతలపై అక్రమ కేసులు నమోదు చేయడాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు తీవ్రంగా ఖండించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో తెదేపా నేతలపై నమోదు చేసిన అక్రమ కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. ఆక్వాకు మద్దతు ధరను తమ లూటీ కోసం రూ.240 నుంచి 210కి కుదించడం జగన్ రెడ్డి అసమర్థతకు నిదర్శనమని మండిపడ్డారు.
ఆక్వా రైతుల సమస్యలపై శాంతియుతంగా పోరాటం చేసిన తెదేపా నేతలను అక్రమ కేసులతో ఇబ్బందులకు గురిచేయడం అప్రజాస్వామిక విధానాలకు నిదర్శనమని దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలో దేశంలోనే అగ్రభాగాన ఉన్న ఆక్వారంగం నేడు పతనావస్థకు చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు. మద్దతు ధర లభించక ఆక్వా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. షరతుల పేరుతో సబ్సీడీలు ఎత్తివేసి, జేట్యాక్స్‌తో ఆక్వా రైతులను దోచుకుంటున్నారని, ప్రశ్నించిన వారిని అణచివేయాలనే జగన్ రెడ్డి కుట్రలు సాగబోవని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.
వైకాపా అసమర్థతో సంక్షోభంలో ఆక్వా: ఆక్వా రైతుల పాలిట జగన్ రెడ్డి విలన్ అని ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు విమర్శించారు. వైకాపా ప్రభుత్వ అసమర్థ విధానాలతో ఆక్వా రంగం సంక్షోభంలో ఉందని విమర్శించారు. వైకాపా పాలనలో ఫీడ్, సీడ్ ధరలు పెరిగి రొయ్యల ధరలు పతనమవుతున్నాయన్నారు. కిలో రొయ్యల ఉత్పాదనకు 300 వ్యయం అవుతుంటే 180కు అమ్ముకుంటున్నారన్నారని వెల్లడించారు. జగన్ రెడ్డి చర్యలతో ఆక్వా రైతులు, ఫీడ్ తయారీదారులు, ప్రాసెసర్లు / ఎగుమతిదారులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారన్నారని మండిపడ్డారు.
ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ యాక్ట్, సీడ్ యాక్ట్‌లను తెచ్చి జేటాక్స్ కోసం ఆక్వా రైతుల్ని వేధిస్తున్నారని విమర్శించారు. ఆక్వా రైతులకు 1.50కే యూనిట్ విద్యుత్ సరఫరా చేస్తామన్న జగన్ రెడ్డి.. ఇప్పుడు 5.30 వరకు వసూలు చేస్తున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా అధికారంలోకి వస్తే ఆక్వా రైతుకు యూనిట్ రూపాయిన్నరకే విద్యుత్ సరఫరా చేస్తామని మంతెన సత్యనారాయణరాజు హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి: