TDP Leaders fire On Police Behaviour : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా సోమవారం మాజీమంత్రి కొల్లు రవీంద్ర సైకిల్ యాత్ర (Kollu Ravindra Cycle Yatra) చేపట్టారు. యాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని నాగాయలంక స్టేషన్‌కు తరలించారు. కొల్లు రవీంద్రకు మద్దతుగా వెళ్లిన మండలి బుద్ధ ప్రసాద్ తనయుడు మండలి వెంకట్రామ్ను పోలీసులు అరెస్టు చేసి.. గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు పోలీస్ స్టేషన్‌కి తరలించారు.
Kollu Ravindra Arrest in Nagayalanka Krishna District : రవీంద్రకు సంఘీభావంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావడంతో పోలీసు స్టేషన్ వద్ద కొంత ఉద్రిక్తత నెలకొంది. దీంతో కొల్లు రవీంద్రకు నోటీసులు ఇచ్చి తిరిగి బందరు తీసుకెళ్లి వదిలేస్తామని పోలీసులు తెలిపారు. కానీ అలా చేయకుండా అర్ధరాత్రి వరకూ నిడమోలు, కూచిపూడి, నాగాయలంక ప్రాంతాల్లో తిప్పారు. కొల్లు రవీంద్ర అదృశ్యంపై ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు హౌజ్ మోషన్ పిటిషన్ కు సిద్ధమయ్యారు.
నాగాయలంక స్టేషన్ నుంచి కొల్లును తీసుకువెళ్లిన పోలీసులు వెనుక వస్తున్న అనుచరుల వాహనాలను దారి మళ్లించి ఆయన్ను అజ్ఞాతంలోకి తీసుకు వెళ్లారు. తన తండ్రి ఆచూకీ తెలపాలంటూ కొల్లు రవీంద్ర కుమారుడు.. పునీత్ చంద్ర జిల్లా ఎస్పీని కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. కృతివెన్ను పోలీస్ స్టేషన్లో కొల్లు రవీంద్రను ఆయన అనుచరులు కనుగొనడంతో పోలీసులు మళ్లీ అక్కడ నుంచి మచిలీపట్నం వైపు తరలించారు. చివరకు మచిలీపట్నంలోని ఆయన నివాసం వద్ద వదిలివెళ్లారు.
ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రోడ్లపై తిప్పుతూ పోలీసులు తన పట్ల దారుణంగా వ్యవహరించారని మాజీమంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలపై ప్రభుత్వం దమనకాండకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Nara lokesh React on Kollu Ravindra Arrest : కొల్లు రవీంద్ర ఆచూకీపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరా తీశారు. సైకిల్ యాత్ర చేస్తున్న మాజీ మంత్రిని ఇంతగా వేధిస్తారా అని మండిపడ్డారు. తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలు మినహా వైసీపీ ప్రభుత్వంలో పాలన కనిపించడం లేదని దుయ్యబట్టారు. ఎవరికి చెప్పకుండా రహస్య ప్రాంతాల్లో తిప్పాల్సిన అవసరం ఏముందని ఆయన చేసిన తప్పేదంటని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
కొల్లు రవీంద్ర ఇంటి వద్ద సోమవారం ఉదయం నుంచి హడావుడి, భయానక వాతావరణాన్ని పోలీసులు సృష్టించారు. 16 గంటలుపైగా తమదైన అధికార "విధులు" నిర్వర్తించిన కాఠిన్యమిది.
ఉదయం:-
6.30: కోదండ రామాలయానికి వెళ్లిన కొల్లు రవీంద్ర.
7.00: ఆలయం వద్దకు చేరుకున్న పోలీసులు.
8.30: కొల్లు రవీంద్రకు, పోలీసులకు మధ్య వాగ్వాదం.
9.00: రవీంద్రను బలవంతంగా ఇంటికి తీసుకువచ్చిన పోలీసులు.. గృహ నిర్బంధంలో ఉండాలని ఆదేశం..
మధ్యాహ్నం: 3.00: గృహ నిర్బంధంలోనే ఉన్న కొల్లు రవీంద్ర.
3.10: కొల్లు రవీంద్రకు ఎలాంటి నోటీసులు ఇవ్వని పోలీసులు
3.15: వ్యక్తిగత పనులపై వెళ్లబోయిన కొల్లు రవీంద్రను అడ్డుకున్న పోలీసులు.
3.20: పోలీసుల అరాచకాన్ని ఖండిస్తూ రవీంద్ర బైఠాయింపు.
సాయంత్రం:-
4.30: రవీంద్రను బలవంతంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు.
4.40: ఇంటి నుంచి పోలీసు వాహనంలో తరలింపు.
5.50: నాగాయలంక ఠాణాకు తరలింపు.
6.00: అవనిగడ్డ, నాగాయలంక టీడీపీ శ్రేణులు ఠాణాకు చేరిక.
6.01: అవనిగడ్డ నుంచి మండలి వెంకట్రామ్.. టీడీపీ నాయకులతో ఠాణాకు రాక.
6.03: కొల్లు రవీంద్ర అరెస్టుపై సీఐ, ఎస్సైతో ఆరా.
6.05: రవీంద్ర అరెస్టుపై టీడీపీ శ్రేణుల నిలదీత, పోలీసుల వైఖరిపై టీడీపీ నేతల నినాదాల హోరు.
6.10: స్టేషన్ నుంచి వెళ్లిపోవాలని సీఐ, ఎస్సై హుకుం జారీ..
6.15: తమ నాయకులను వదిలేవరకు కదలబోమని భీష్మించిన టీడీపీ కార్యకర్తలు.
6.20 నాగాయలంక పోలీస్‌స్టేషన్ నుంచి కొల్లు రవీంద్రను ఇంటికి పంపిస్తున్నామని చెప్పిన పోలీసులు.
6.21: పోలీసుల మీద నమ్మకం లేదు.. తమ ముందే విడుదల చేయాలని టీడీపీ నాయకుల డిమాండ్.
6.25: సందేహం ఉంటే తమతో రావచ్చన్న పోలీసులు.. వెంకట్రామ్ కూడా కొల్లు రవీంద్రతో కలిసి పోలీసు బండి ఎక్కారు.
6.30: ఒకే వాహనంలో కొల్లు, వెంకట్రామ్ బందరుకు తరలించిన పోలీసులు
రాత్రి:-
7.15: బందరు శివారు వచ్చే సరికి.. వేరే వాహనంలో వెంకట్రామ్ మార్పు..
8.30: ఉంగుటూరు పోలీస్‌స్టేషన్‌కు వెంకట్రామ్ తరలింపు.
9.00: ఇనగుదురుపేట ఠాణాలో, ఎస్పీ కార్యాలయంలో కొల్లు రవీంద్ర కుమారుడి ఫిర్యాదు.
10.00: ఉంగుటూరులో మండలి వెంకట్రామ్ విడుదల చేసిన పోలీసులు.
10.50: రవీంద్రను నాలుగున్నర గంటల పాటు జిల్లా మొత్తం తిప్పిన పోలీసులు
11.00: ఎట్టకేలకు బందరులో ఇంటి వద్ద రవీంద్రను వదిలేసిన పోలీసులు.
టీడీపీ నేతల వినూత్న నిరసన : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆరోగ్యం పట్ల ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను పార్టీ నాయకులు తప్పబట్టారు. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలంలోని పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు సజ్జల ప్రవర్తన సింహాసనంపైన ఉంచిన శునకంను పోలి ఉందంటూ.. వినూత్న నిరసన తెలిపారు. కుర్చీపై కుక్కను కూర్చోబెట్టి ప్రభుత్వ సలహాదారులకు దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు ఆరోగ్యం పట్ల కూడా బాధ్యత లేకుండా చౌకబారు విమర్శలు సమంజసం కాదన్నారు.