రాష్ట్రంలో దళితులపై వరుస దాడులు జరుగుతున్నా ఇంతవరకు ఎస్సీ కమిషన్ ఛైర్మన్‌ను సీఎం జగన్ రెడ్డి ఎందుకు నియమించలేదని తెదేపా ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం.ఎస్.రాజు నిలదీశారు. దాడుల్ని కమిషన్ ప్రశ్నిస్తుందనే రెండేళ్లుగా ఎస్సీ కమిషన్‌ను నియమించలేదని ఆరోపించారు. దాడులు చేసిన సొంతపార్టీ నేతలకు శిక్షపడుతుందనే భయంతోనే ఎస్సీల పట్ల చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
కాసులు లేని కార్పొరేషన్ల పదవులు బీసీ, ఎస్సీలకు ఇచ్చి, లక్షల్లో జీతభత్యాలు ఉండే వాటిని సొంత వర్గానికి కేటాయించుకున్నారని ఎం.ఎస్.రాజు దుయ్యబట్టారు. మాటతప్పటం, మడమ తిప్పటం పుట్టుకతో వచ్చిన విద్యలా జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రాక్షసపాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. నిరుద్యోగ యువతను అక్రమంగా నిర్బంధించి అరెస్టులు చేయటం దుర్మార్గమన్నారు. తాడేపల్లి గడప దాటని ముఖ్యమంత్రికి, రెండేళ్లుగా పట్టించుకోని పోలవరం పనులు.. నిరుద్యోగులు ఆందోళన ఇచ్చిన రోజే గుర్తుకొచ్చిందా అని నిలదీశారు. నిరుద్యోగుల సమస్య నుంచి పారిపోయేందుకే సీఎం పోలవరం పర్యటనకు వెళ్లారని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి