TDP LEADER PATTABHI BAIL PETION UPDATES: కృష్ణా జిల్లా గన్నవరంలో గత నెలలో జరిగిన ఘటనల నేపథ్యంలో గన్నవరం సీఐపై దాడి చేశారన్న ఆరోపణలతో టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఆ ఘటనకు సంబంధించి తనపై నమోదు చేసిన కేసులో బెయిల్ ఇవ్వాలంటూ తాజాగా పట్టాభి.. విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ దాఖలపై నేడు కోర్టులో విచారణ జరిగింది.
ఈ క్రమంలో సీఐ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ..పట్టాభి బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. పోలీసు అధికారికే రక్షణ లేనప్పుడు సామాన్యుడికి రక్షణ ఎలా ఉంటుందని సీఐ కనకారావు తరఫు న్యాయవాది ప్రశ్నించారు. అనంతరం పట్టాభిని తోట్లవల్లూరు పోలీసు స్టేషన్‌లో కొట్టారని పట్టాభి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదోపవాదాలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం.. తీర్పును రిజర్వ్ చేసింది. కస్టడీ, బెయిల్ పిటిషన్లపై స్పెషల్ కోర్టు జడ్జి శుక్రవారం ఆదేశాలు ఇవ్వనుందని పేర్కొంది.
అసలు ఏం జరిగిందంటే: కృష్ణా జిల్లా గన్నవరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించారంటూ పట్టాభి రామ్‌పై పోలీసులు 21 Feb 2023న వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిందన్న సమాచారం తెలియడంతో పట్టాభి గన్నవరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకొని.. వాహనంలో ఎక్కించుకుని అక్కడి నుంచి వేరే చోటికి తరలించారు. అనంతరం వీరవల్లి, ఆ తర్వాత హనుమాన్‌జంక్షన్ ఠాణాకు తరలిస్తున్నారని చెప్తూ, ఆ రెండు చోట్లకు తీసుకురాలేదు. మరోవైపు ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉండటం, ఎక్కడ ఉన్నారనే విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. ఇంకోవైపు తన భర్త ఆచూకీని తెలపాలంటూ పట్టాభి భార్య చందన ధర్నాకు దిగారు. దీంతో ఆ మరుసటి రోజు మధ్యాహ్నానికి గన్నవరం పీఎస్‌కు పట్టాభిని తీసుకొచ్చారు.
మరోవైపు గత నెల 20వ తేదీన గన్నవరం దౌర్జన్యకాండకు పాల్పడిన బాధ్యులను అరెస్టు చేయాలని టీడీపీ నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేస్తూ..ధర్నాలు చేపట్టారు. టీడీపీ కార్యాలయంపై జరిగిన ఘటనలో సీఐ కనకారావుకు తగిలిన రాయిని వైసీపీ శ్రేణులే విసిరానని.. టీడీపీ నాయకులు, పట్టాభి విసిరిన రాయి కాదని స్పష్టతనిచ్చారు. ఎలాంటి విచారణ చేపట్టకుండా టీడీపీ పార్టీ నాయకులను అరెస్టు చేయడంపై మండిపడ్డారు. వైసీపీలో రాజకీయ నాయకులందరి కన్నా అత్యంత తెలివైన నేరస్థుడు ఎమ్మెల్యే వంశీమోహన్ అని, పోలీసులు అతన్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా పట్టాభిపై పెట్టిన ఎట్రాసిటీ, 307 కేసులను ఎత్తివేయాలని కోరారు.
ఇవీ చదవండి