Devineni Uma on new districts : ప్రభుత్వం హడావుడిగా చేస్తున్న కొత్త జిల్లాల ఏర్పాటుతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయని మాజీ మంత్రి దేవినేని, తెదేపా నేత ఉమామహేశ్వరరావు ఆరోపించారు. కొందరు అధికారులు ప్రమోషన్లు, పదవులకు ఆశపడి ముఖ్యమంత్రికి తప్పుడు సలహాలు ఇస్తున్నారని మండిపడ్డారు. మైలవరంను రెవెన్యూ డివిజన్ చేయాలని విజయవాడ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో దేవినేని ఉమా వినతిపత్రం అందించారు.
ప్రభుత్వం బుద్ధి, జ్ఞానం లేకుండా వ్యవహరిస్తోందని దేవినేని ఉమా దుయ్యబట్టారు. జనగణన తర్వాత, నియోజకవర్గ పునర్విభజన చేయాల్సి ఉందని కోరారు. కొత్త జిల్లాల ప్రక్రియపై పునరాలోచన చేయాలని..ప్రజల సెంటిమెంటును గౌరవించాలని విజ్ఞప్తి చేశారు.
సీఎం జగన్ రాజీనామా చేయాలి..
వివేకా హత్యకు సంబంధించి ముఖ్యమంత్రి నైతిక బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలని మాజీమంత్రి దేవినేని ఉమ డిమాండ్ చేశారు. హత్య జరిగిన తర్వాత నిందితులు ఎవరితో మాట్లాడారో.. కాల్ డేటా విశ్లేషించాలన్నారు. విజయసాయి రెడ్డిని అరెస్టు చేస్తే విచారిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని మండిపడ్డారు. సీబీఐ చార్జ్ షీట్ వచ్చినా.. అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. అప్రూవర్‌గా మారిన దస్తగిరిని బెదిరిస్తూ.. విచారణ చేస్తున్న సీబీఐపైనే కేసు పెడుతున్నారని ఆరోపించారు.