Devineni Uma: కృష్ణా జిల్లా జి.కొండూరు బంద్ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు పాల్గొన్నారు. మైలవరాన్ని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలన్న ఉద్యమంతో ప్రభుత్వానికి తత్వం బోధపడినట్లుందని ఉమ అన్నారు. వందల మంది పోలీసుల్ని మోహరించి బంద్‌ను అడ్డుకోవాలని చూశారని ఆరోపించారు. వ్యాపారులు, ప్రజలు మైలవరంలో స్వచ్ఛందంగా బంద్‌ని విజయవంతం చేశారని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే ఈ ఉద్యమానికి సహకరించాల్సింది పోయి, నాయకులను ముందస్తు అరెస్టు చేయించి ఏం సాధించారని విమర్శించారు. మైలవరానికి రెవెన్యూ డివిజన్ తీసుకురావాల్సి ఉన్న ఎమ్మేల్యే మాట్లాడాలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోతే మైలవరం రెవెన్యూ డివిజన్ అఖిలపక్ష పోరాట సాధన సమితి ఉద్యమాన్ని ఉధృతం చేస్తోందని హెచ్చరించారు. గురువారం రెడ్డిగూడెంలో బంద్ కు పిలుపునిచ్చారు. ఇక మైలవరం రెవెన్యూ డివిజన్ సాధన సమితి అఖిలపక్షానికి సీఎం మేనత్త ఊరు గణపవరం గ్రామ వైకాపా కార్యకర్తలు మద్దతు తెలిపారు. రెవెన్యూ డివిజన్ సాధన కొరకు గత పది రోజులుగా మైలవరంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు.
ఇదీ చదవండి: ముందస్తు ఎన్నికలకు వైకాపా.. తెదేపాకు 160 సీట్లు: అచ్చెన్న