రాష్ట్రంలో ప్రత్యక్ష పన్నుల పేరుతో వైకాపా ప్రభుత్వం ప్రజల నడ్డి విరుస్తోందని మాజీమంత్రి ఆలపాటి రాజా ధ్వజమెత్తారు. ఇంటిపన్ను, ఆస్తి పన్ను, మరుగుదొడ్డి పన్ను, మంచినీటి పన్ను, నిత్యావసర ధరలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో పేదవాడిని మరింత పేదవాడిగా మార్చిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుందని విమర్శించారు.
ప్రజల జీవన ప్రమాణాలు అట్టడుగుకు చేరుతుంటే.. ప్రభుత్వం చేయూతనివ్వకుండా చోద్యం చూస్తోందని మండిపడ్డారు. జగన్కు ఎన్నికలంటే నమ్మకం లేదు కాబట్టే.. ప్రజాస్వామ్యానికి విలువివ్వకుండా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్, నగరపాలక ఎన్నికల్లో ప్రజలు వైకాపాకు తప్పకుండా బుద్ధిచెబుతారని వ్యాఖ్యానించారు.
అభ్యర్థుల్ని బలవంతంగా వైకాపాలో చేర్చుకున్నారు: అశోక్ బాబు
పలాస పురపోరులో తెదేపా తరఫున నామినేషన్ దాఖలు చేసిన నలుగురు అభ్యర్థుల్ని బలవంతంగా వైకాపాలో చేర్చుకున్నారని ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆరోపించారు. మంత్రి సీదిరి అప్పలరాజు వారిని ప్రలోభపెట్టి, భయపెట్టి పార్టీ మారేలా చేశారని పేర్కొన్నారు. నామినేషన్ పత్రాల్లో తెదేపా తరఫున పోటీచేస్తున్నామని చెప్పిన వారు.. వైకాపా కండువా ఎలా కప్పుకుంటారని ప్రశ్నించారు. అభ్యర్థులు పార్టీ మారినా ఓటర్లు మారరని.. వైకాపాలో చేరిన వారిని పోటీనుంచి తప్పించి, అనర్హులుగా ప్రకటిస్తూ ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని అశోక్బాబు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
పవన్ స్టేట్ రౌడీ.. ఆయన అనుచరులే ఆకు రౌడీలు: ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్