Olive Ridley turtles : సరీసృపాల్లో అతి ప్రాచినమైనవి సముద్ర తాబేళ్లు. ఈ జాతి తాబేళ్లు 100 నుంచి 150 సంవత్సరాల పాటు జీవిస్తాయి. ఆహారం కోసం, గుడ్లు పెట్టేందుకు సుమారు 20వేల కిలోమీటర్లు వరకు వలస వెళుతుంటాయి. ప్రపంచ వ్యాప్తంగా ఏడు రకాల సముద్ర తాబేళ్ల జాతులు ఉండగా... వీటిలో 5 రకాలు భారతదేశంలో ఉన్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి ఎక్కువగా వచ్చేవి అలివ్ రిడ్లీ తాబేళ్లు. ఒక్కో సముద్ర తాబేలు ఒకేసారి సుమారు 90 నుంచి 165 గుడ్లు పెడుతుంది. ఇక్కడ జన్మించిన ఈ జాతి తాబేళ్లు.. క్రమం తప్పకుండా ప్రతి పదేళ్లకోసారి ఇక్కడికే వచ్చి గుడ్లు పెట్టి సంతతిని పెంపొందించుకుంటాయి. ఇదే ఈ జాతి తాబేళ్ల ప్రత్యేకత.
నది - సముద్రం కలిసే చోటే..
సంతాన వృద్ధి కోసం ఏటా డిసెంబర్ నుంచి మార్చి నెల వరకు సముద్ర తాబేళ్లు వస్తుంటాయి. అందుకోసం "నది - సముద్రం" కలిసే చోటునే ఎంచుకుని గుడ్లు పెట్టి పొదుగుతాయి. రాష్ట్రంలోని కృష్ణా జిల్లా పాలకాయతిప్ప, నాగాయలంక లైట్ హౌస్, సంగమేశ్వరం, సొర్లగొంది, ఈలచెట్లదిబ్బ, గుంటూరు జిల్లా సూర్యలంక, నిజాంపట్నం సముద్రపు ఒడ్డుకు వచ్చే భారీ సైజు సముద్ర తాబేళ్లు.. స్థానిక ప్రజలతోపాటు పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి.
తాబేళ్ల భద్రతపై ఆందోళన..
ఇన్ని ప్రత్యేకతలు ఉన్న అలివ్ రిడ్లీ తాబేళ్ల భద్రతపై ఆందోళన నెలకొంది. సంరక్షణ చర్యలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొంతమేర చర్యలు చేపడుతున్నా.. అవి సరిపడనంతగా ఉండటం లేదు. దీనివల్ల సముద్ర తాబేళ్లు పెద్దఎత్తున మృత్యువాత పడుతున్నాయి. అరుదైన అలివ్ రిడ్లీ తాబేళ్ల జాతిని సంరక్షించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని పర్యాటకులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: Cinema Exhibitors Meeting: కర్ఫ్యూ సమయంలో థియేటర్లకు సడలింపు ఇవ్వాలి: సినిమా ఎగ్జిబిటర్లు