భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని డీజీపీ కార్యాలయం వద్ద ధర్నాకు భాజపా పిలుపునివ్వటంతో సోమువీర్రాజు ఇంటి వద్ద పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఆయన ఇంటి నుంచి బయటకు రాగానే అడ్డుకున్నారు. తాను ఏం తప్పు చేశానని ఇంటికి పోలీసులు వచ్చారని సోము నిలదీశారు. అర్ధరాత్రి ఇష్టం వచ్చినట్లు తలుపులు కొడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'అపార్ట్మెంట్లో నేను అద్దెకు ఉంటున్నా. ఇంతమంది పోలీసులు వస్తే చుట్టు పక్కల వారంతా ఏమనుకుంటారు?. నేను ఇక్కడ ఉండాలా...ఇల్లు ఖాళీ చేయాలా?. నేను డీజీపీ కార్యాలయం ముట్టడిస్తానని చెప్పలేదు కదా. నా ముందు పోలీసులు ఎవరూ ఉండకూడదు. మీ ప్రవర్తనా, వైఖరిని ఖండిస్తున్నా' అని ధ్వజమెత్తారు సోమువీర్రాజు.
ఇదీ చదవండి: డీజీపీ కార్యాలయ ముట్టడి యత్నం భగ్నం.. గృహనిర్బంధంలో భాజపా నేతలు