రాష్ట్రంలో మరో ఉత్పత్తి ప్లాంటు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపోందిస్తున్నామని చైనా ఫోన్ల తయారీ దిగ్గజం షావోమి ముఖ్యమంత్రి జగన్ కు స్పష్టం చేసింది. ఆయనతో భేటీ అయిన సంస్థ ప్రతినిధులు మొబైల్ ఫోన్లతో పాటు ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై సంస్థ ప్రణాళికలను ముఖ్యమంత్రికి వివరించారు. ఏపీలో రెండో ప్లాంటుగా తిరుపతి సమీపంలోని పోర్టు ప్రాంతమైన రేణిగుంటలో అయితే మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి తయారీ ప్లాంటుకు అనువైందని ఆ సంస్థ వెల్లడించింది. ఎలక్ట్రిక్ సైకిళ్లు, ట్రైసైకిళ్లు, స్కూటర్ల తయారీ ఆలోచన కూడా ఉందని తెలిపింది. తయారీ ప్లాంటుకు అవసరమైన సహాయ, సహకారాలను అందించడానికి సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వారికి హామీ ఇచ్చారు.
అంతకుముందు షావోమి ప్రతినిధులు పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డితోనూ భేటీ అయ్యారు. ప్రస్తుతం దేశంలో మొబైల్ ఫోన్లు, స్మార్ట్ టీవీల విక్రయాల్లో షావొమి అగ్రస్థానంలో ఉంది. భారత్‌లో 40 శాతం స్మార్ట్ టీవీలను, 35శాతం మొబైల్ ఫోన్లను షావొమి విక్రయించగా, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద కంపెనీగా కొనసాగుతోంది. షావొమి విక్రయిస్తున్న స్మార్ట్ ఫోన్లలో 90శాతం నెల్లూరులోని శ్రీసిటీలో తయారవుతున్నాయి. చిత్తూరు జిల్లా రేణిగుంట ప్రాంతంలో ఉన్న ఎలక్ట్రానిక్స్‌పార్క్‌లో మొబైల్ విడిభాగాలతో పాటు ఎలక్ట్రానిక్స్ వస్తువుల తయారీకి కంపెనీ ఆసక్తి చూపిస్తోంది.