Several leaders strongly condemned : మందడంలో రాజధాని రైతులు నిర్వహించిన సభలో పాల్గొని వెళ్తున్న బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వాహనంపై వైఎస్సార్సీపీ శ్రేణుల దాడిని విపక్షాలు మూకుమ్మడిగా ఖండించాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో పాటు బీజేపీ రాష్ట్ర అగ్రనేతలు ఈ ఘటన హేయమైన చర్యగా అభివర్ణించారు. మరోవైపు సత్యకుమార్‌పై వైఎస్సార్సీపీ దాడికి నిరసనగా రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు దిగుతున్నామని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు.
అమరావతి ఉద్యమానికి మద్దతు పలికి వస్తున్న బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వాహనంపై వైఎస్సార్సీపీ గూండాల దాడిని ఖండిస్తున్నట్లు తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెలిపారు. పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై వైఎస్సార్సీపీ మూకలు దాడులకు పాల్పడుతున్నాయని ధ్వజమెత్తారు. సత్య కుమార్ పై వైఎస్సార్సీపీ పెయిడ్ ఉద్యమ కారుల దాడి దుర్మార్గమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలకు జగన్ మూడు పూటలా భోజనం పెట్టించి 3 రాజధానులంటూ పెయిడ్ ఉద్యమం నడుపుతున్నారని మండిపడ్డారు. జై అమరావతి అన్న వారిపై జగన్ రెడ్డి దాడులు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. మూడు రాజధానులు అన్న ముఖ్యమంత్రి జగన్ కి యువత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెంప పగులగొట్టినా.., ఆయన తీరు మారలేదని దుయ్యబట్టారు. అందుకే వచ్చే ఎన్నికల్లో జగన్ రెండు చెంపలు వాయించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. సత్య కుమార్ పై దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాజధాని రైతులకు మద్దతిస్తే దాడి చేస్తారా? అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. సత్యకుమార్‌పై దాడి సరికాదని, దాడి ఘటనను దిల్లీ పెద్దలు తీవ్రంగా పరిగణించాలని ఆయన పేర్కొన్నారు. దాడి ఘటనపై కేంద్రం సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ దౌర్జన్యాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని పవన్ తెలిపారు.
సత్యకుమార్ కారుపై దాడిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఖండించారు. దాడి వెనుక వైఎస్సార్సీపీ నేత నందిగామ సురేశ్, ముఖ్యమంత్రి జగన్ ఉన్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య దేశంలో దాడులు సమంజసం కాదన్నారు. కోర్టుల్లో మూడు రాజధానుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎదురుదెబ్బ తగులుతున్నా ముఖ్యమంత్రి జగన్ వెనక్కి తగ్గకపోవడమేంటని ప్రశ్నించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర పట్టభద్రులు సరైన బుద్ధి చెప్పినా విశాఖే రాజధాని అని ప్రకటించడం దేనికి సంకేతమన్నారు.
రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు బీజేపి పిలుపు.. సత్యకుమార్‌పై దాడికి నిరసనగా ఏప్రిల్ 1న శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు బీజేపీ పిలుపునిచ్చింది. అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించి కలెక్టర్లు, ఎస్పీలకు వినతిపత్రాలు అందించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు.
రైతులకు మద్దతు తెలపటానికి వెళ్లి వస్తున్న బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పై వైఎస్సార్సీపీ కార్యకర్తల దాడి అమానుషమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి పురందేశ్వరి మండిపడ్డారు. అనంతపురం నగరంలోని పార్టీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే కోటా, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి పరాభవం ఎదురైందని అన్నారు.
తనపై కుట్ర జరుగుతోందని, తనకు ఏమైనా జరగొచ్చని మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి ఆవేదన చెందారు. రైతులిచ్చిన భూముల్లోనే సచివాలయం, శాసనసభ, హైకోర్టు కార్యకలాపాలు నిర్వహిస్తూ వారి నోళ్లు కొట్టడం సరికాదని... అమరావతి ఇక్కడే ఉంటుంది... ఉండాలని తాను మాట్లాడానని.... దీన్ని తట్టుకోలేక తనపై కుట్రలు చేస్తున్నారని అన్నారు. తన భుజానికి వైద్యం చేయించుకున్నందున కొంత ముందుగా శిబిరం నుంచి వచ్చానని... ఈలోగా తన గురించి ఆరా తీసి సత్యకుమార్ కారుపై దాడి చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ఈ దాడికి పైస్థాయి నుంచి కిందస్థాయి వరకు ప్రమేయం ఉందనే అనుమానం కలుగుతోందన్నారు.
ప్రత్యర్ధులపై భౌతికదాడులే ప్రజాస్వామ్యమా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. శాసనసభలో అమరావతే రాజధాని అని చెప్పిన మాటనే తమ పార్టీ జాతీయ కార్యదర్శి గుర్తు చేస్తే ఈ పద్ధతిలో దాడులు చేయడం దిగజారుడు రాజకీయం కాదా? అని నిలదీశారు. జరిగిన ఘటనకు వైఎస్సార్సీపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు.
సత్య కుమార్ పై అధికార పార్టీ దన్నుతో కొందరు గూండాలు దాడి చేయడం హేయమైన చర్య అని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత వైఎస్ చౌదరి అన్నారు. హింసను ప్రోత్సహించే వారు ఎప్పటికైనా పతనం కాక తప్పదని పేర్కొన్నారు. దాడిని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీవీఎన్ మాధవ్, రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం, ఇతర నాయకులు ఖండించారు. దాడికి వ్యూహరచన చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల సాక్షిగా సత్యకుమార్ వాహనంపై జరిగిన దాడిని ఎంపీ కే.రఘురామకృష్ణంరాజు తప్పుపట్టారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికి ఉందా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ విధ్వంసకాండపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఇవీ చదవండి :